కోలీవుడ్ లో విషాదం.. సీనియర్ నటుడు, నిర్మాత మనోబాల మృతి

తమిళ సినిమా పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. అత్యంత ప్రతిభావంతమైన నటుడుగా పేరు తెచ్చుకున్న మనోబాల కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన చెన్నైలోని ఓ హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు.

మనోబాల.. నటుడుగానే కాక నిర్మాతగా, దర్శకుడుగానూ ఆయన తనదైన ముద్రను వేశారు. విభిన్నమైన ఆహార్యం, డైలాగ్ డెలివరీతో ఎలాంటి పాత్రలో అయినా అలవోకగా ఒదిగిపోయారు మనోబాల. ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్ అధ్భుతం అన్న పేరు తెచ్చుకున్నారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా తమిళ సినిమా పరిశ్రమతో అనుబంధం ఉన్న వ్యక్తి మనోబాల.


1953 డిసెంబర్ 8న జన్మించారు మనోబాల. ముప్ఫైయేళ్ల వయసులో సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు. మొదట అతన్ని రికమెండ్ చేసింది కమల్ హాసన్ కావడం విశేషం. అప్పటి నుంచీ వీరి మధ్య ఒక ప్రత్యేకమైన అనుబంధం కొనసాగుతోంది. ముందుగా అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలుపెట్టిన మనోబాల తను పనిచేసిన తొలి చిత్రం ‘పుదియ వార్పుగల్’లోనే ఒక చిన్న పాత్ర పోషించి ఆకట్టుకున్నారు. స్వయంగా రచయిత కూడా కావడంతో తన బ్యానర్ లోనూ, దర్శకత్వంలోనూ వచ్చిన చిత్రాలకు తనే కథలు రాసుకునేవారు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలా కమెడియన్ గా మెప్పిస్తూ దర్శకుడు, నిర్మాతగానూ రాణించిన మరో నటుడు లేరు అంటే అతిశయోక్తి కాదు. తను తమిళ్ లో చేసిన ఎన్నో సినిమాల డబ్బింగ్ వెర్షన్స్ రూపంలో తెలుగు వారికీ ఎంతో సుపరిచితులు అయ్యారు మనోబాల. తెలుగులో మెగాస్టార్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉండేది. అందుకే మెగాస్ఠార్ రీసెంట్ బ్లాక్ బస్టర్ వాల్తేర్ వీరయ్యలో జడ్జి పాత్రలో కనిపించి ఆ కాసేపూ నవ్వించారు మనోబాల.

స్వతహాగా తమిళ్ సినిమా వారే అయినా.. దక్షిణాదిలోని అన్ని భాషల ప్రేక్షకులకూ సుపరితులు మనోబాల. ఏదేమైనా అడుగు పెట్టిన అన్ని రంగాల్లోనూ ప్రతిభ చూపిన మనోబాల మరణం తమిళ చిత్ర సీమకు తీరని లోటుగానే చెప్పాలి.

Related Posts