ఈవారం చిన్న సినిమాలదే హవా

ఎన్నికల వేడి చల్లారింది. జనం అంతా ఇప్పుడు ఎంటర్‌టైన్ మెంట్ మూడ్ లో ఉన్నారు. కాలక్షేపం కోసం కొత్త సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇక.. ప్రతివారం తరహాలోనే ఈ వారం కూడా పలు సినిమాలు సినీ ప్రేమికుల్ని అలరించడానికి రెడీ అవుతున్నాయి.

ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న చిత్రాలలో కాస్త క్రేజున్న మూవీ ‘రాజు యాదవ్’. ‘జబర్దస్త్’ ప్రోగ్రామ్ లో వెరైటీ గెటప్స్ తో ఆడియన్స్ ను అలరించే గెటప్ శ్రీను హీరోగా నటించిన చిత్రమిది. సాయి వ‌రుణ‌వి క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌ పై ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వేణు ఊడుగుల వద్ద ‘నీది నాది ఒకే క‌థ‌, విరాట‌ప‌ర్వం’ చిత్రాల‌కు చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ గా ప‌నిచేసిన కృష్ణమాచారి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో గెటప్ శ్రీనుకి జోడీగా అంకిత క‌ర‌త్ నటించగా.. ఆనంద్ చక్రపాణి, రూపాల‌క్ష్మి ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. మే 17న ‘రాజు యాదవ్’ విడుదలకు ముస్తాబవుతోంది.

ఈవారం థియేటర్లలోకి వస్తోన్న చిత్రాలలో ‘రంగస్థలం’ మహేష్, సుదర్శన్‌, ఇనయ సుల్తానా ప్రధాన పాత్రలు పోషించిన ‘నటరత్నాలు’ కూడా ఉంది. నర్రా శివనాగు దర్శకత్వం ఈ సినిమాకి దర్శకుడు. శాంతి, జీకే వికాస్‌ ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘దర్శిని’ కూడా ఈ వారం రిలీజవుతోన్న సినిమాల్లో ఉంది. థ్రిల్లర్‌ నేపథ్యంలో డా. ప్రదీప్‌ అల్లు ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ వారం థియేటర్లలోకి వస్తోన్న మరో హారర్ థ్రిల్లర్ ‘అక్కడవారు ఇక్కడ ఉన్నారు’. సాయిహర్షిణి, యస్వీ రమణ, కేవీ రమణ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాని కందుర్తి త్రివిక్రమ రావు తెరకెక్కించారు.

ఈ వారం ఈ చిన్న సినిమాలతో పాటు.. విక్రమ్ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘అపరిచితుడు’ కూడా రీ-రిలీజ్ రూపంలో థియేటర్లలో సందడి చేయబోతుంది. 2005లో విడుదలైన ‘అపరిచితుడు’ చిత్రం అటు తమిళం, ఇటు తెలుగు భాషల్లో అఖండ విజయాన్ని సాధించింది. విక్రమ్ కెరీర్ ను మలుపు తిప్పిన చిత్రంగా ‘అపరిచితుడు’ని చూడొచ్చు.

ఆస్కార్ ఫిల్మ్స్ బ్యానర్ పై వి.రవిచంద్రన్ నిర్మించిన ‘అపరిచితుడు’ మే 17న మళ్లీ థియేటర్లలోకి రాబోతుంది.

Related Posts