‘బిగ్ బాస్‘ వంటి రియాలిటీ షో మన తెలుగులో క్లిక్ అవుతోందా? అనుకున్నారంతా. మన సంస్కృతి, సంప్రదాయాలకు విరుద్ధంగా వెస్ట్రన్ కల్చర్ తో సాగే ఇలాంటి షోస్ కి మన దగ్గర ఆదరణ లభించదు అనే విమర్శలూ వచ్చాయి. అయినా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ జోష్ ఫుల్ హోస్టింగ్ తో తెలుగులో తొలి సీజన్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత నాని, ఇక.. అక్కడ్నుంచీ వరుసగా నాగార్జున నేతృత్వంలో ‘బిగ్ బాస్‘ ఏడు సీజన్లు పూర్తిచేసుకుంది.
లేటెస్ట్ గా కింగ్ నాగార్జున హోస్టింగ్ తో ‘బిగ్ బాస్ -8‘ షురూ అయ్యింది. అంగరంగ వైభవంగా ప్రారంభమైన ‘బిగ్ బాస్ -8‘ తొలి ఎపిసోడ్ నుంచే ఈ రియాలిటీ షో పై ఆసక్తి కలిగించడంలో సఫలమయ్యారు నిర్వహకులు. ‘బిగ్ బాస్‘ సీజన్ 8 ప్రారంభం నుండి కంటెస్టెంట్ల ఎంపిక మరియు వారికి చెల్లించే పారితోషికంపై విస్తృత చర్చ జరుగుతూ ఉంది. ‘బిగ్ బాస్‘లో పాల్గొనే పార్టిసిపెంట్స్ కి వారానికి ఇంత మొత్తం అని ఇస్తుంటారు. హౌజ్ లోకి ప్రవేశించిన వారి స్టార్ డమ్ ను బట్టి.. వారి పారితోషికాలు నిర్ణయిస్తుంటారు.
‘బిగ్ బాస్‘ కంటెస్టెంట్స్ కి సంబంధించిన రెమ్యునరేషన్ వివరాలు ఏవీ నిర్వహకులు అధికారికంగా ప్రకటించరు. అయితే.. ఆయా కంటెస్టెంట్స్ కు ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణ బట్టి పారితోషికాన్ని ఇస్తుంటారు. ఈ లెక్కన ఇప్పుడు బిగ్ బాస్ హౌజ్ లో ఉన్న పార్టిసిపెంట్స్ పారితోషికాల వివరాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ లిస్టులో ముందుంది విష్ణు ప్రియ. ప్రస్తుతం ‘బిగ్ బాస్‘ హౌజ్ లో అత్యధిక పారితోషికం పొందుతున్న కంటెస్టెంట్‌గా విష్ణు ప్రియను పేర్కొంటున్నారు నెటిజన్స్. ఈమెకు వారానికి రూ. 3.75 లక్షలు వరకు పారితోషికం లభించే అవకాశం ఉందట. ఆ తర్వాతి స్థానాల్లో వారానికి మూడేసి లక్షలతో ఉన్నారు ఆదిత్యం ఓం, నిఖిల్.
యష్మి గౌడ, సోనియా, ప్రేరణ.. ఈ ముగ్గురు కంటెస్టెంట్లకు వారానికి రూ. 2.5 లక్షల వరకు పారితోషికం లభించే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది.
ఇంకా.. ఇటీవల రాజ్ తరుణ్-లావణ్య వివాదంలో ఎక్కువగా కనిపించిన శేఖర్ భాషాకు వారానికి రూ. 2.5 లక్షల వరకు పారితోషికం లభించే అవకాశం ఉందనేది సోషల్ మీడియా టాక్.
నైనిక, కిర్రాక్ సీత లకు వారానికి రూ. 2.3 లక్షల వరకు పారితోషికం లభించే అవకాశం ఉందట.
అభయ్ నవీన్ కు వారానికి రూ. 2 లక్షలు, నబీల్ అఫ్రిది కి 1.75 లక్షలు వచ్చే ఛాన్స్ ఉందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో జోరుగా సాగుతోంది.
మొత్తంగా.. ఈసారి బిగ్ బాస్ హౌజ్ లో అత్యధిక పారితోషికం పుచ్చుకుంటోన్న వ్యక్తిగా విష్ణు ప్రియ ప్రముఖంగా వినిపిస్తుంది.