ప్రముఖ తమిళ నటుడు ఢిల్లీ గణేష్ శనివారం రాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. ఆయన మరణవార్తతో తమిళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. పెరిగిన వయసు రీత్యా ఆయన కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన తన ఇంట్లోనే అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు.
ఢిల్లీ గణేష్ సుమారు 400కు పైగా చిత్రాల్లో నటించి తమిళ సినీ ప్రేక్షకులను అలరించారు. సినిమాల్లోకి రాకముందు, 1964-74 మధ్య కాలంలో ఆయన భారతీయ వైమానిక దళంలో సేవలు అందించారు. కళలపై ఆసక్తితో ఢిల్లీకి చెందిన దక్షిణ భారత నాటక సభలో సభ్యుడిగా వ్యవహరించారు. అనంతరం సినిమాల్లోకి అడుగుపెట్టి, కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘పట్టిన ప్రవేశం’ చిత్రంతో తన సినీ జీవితాన్ని ప్రారంభించారు.
నటుడు కమల్‌హాసన్‌తో ఆయనకు మంచి అనుబంధం ఉంది. ‘నాయకన్, అపూర్వ సోదరగల్, మైఖేల్ మదన కామ రాజన్, తెనాలి’ వంటి చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించి ప్రేక్షకులను అలరించారు. ఢిల్లీ గణేష్ ‘అభిమన్యుడు, ఇండియన్ 2, కాంచన 3’ వంటి పలు అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకూ బాగా సుపరిచితమే.