HomeMoviesటాలీవుడ్మరికొద్ది గంటల్లో తేలనున్న ఫలితాలు

మరికొద్ది గంటల్లో తేలనున్న ఫలితాలు

-

టాలీవుడ్ కి మళ్లీ పండగ కళ వచ్చింది. సంక్రాంతి, సమ్మర్ వంటి సీజన్లలోనే బాక్సాఫీస్ వద్ద ఎక్కువగా సినిమాల సందడి ఉంటుంది. ఆగస్టు 15 వంటి స్వాతంత్ర్య దినోత్సవం రోజు.. ఒకటి లేదా రెండు సినిమాలు విడుదలవ్వడం ఆనవాయితీ. కానీ.. ఈసారి నాలుగు చిత్రాలు బాక్సాఫీస్ కి క్యూ కడుతున్నాయి. రేపు రాబోయే నాలుగు సినిమాలపైనా మంచి అంచనాలు ఉండడం విశేషం.

ముందుగా మాస్ మహారాజ రవితేజ ‘మిస్టర్ బచ్చన్‘ గురించి చెప్పుకుంటే. ఆగస్టు 15 స్లాట్ లోకి ఆలస్యంగా వచ్చినా.. రేపు విడుదలయ్యే చిత్రాలలో ‘మిస్టర్ బచ్చన్‘కి మంచి క్రేజుంది. అసలు ఈరోజు నుంచే ‘మిస్టర్ బచ్చన్‘ ప్రీమియర్స్ మొదలవ్వబోతున్నాయి. ఈనేపథ్యంలో.. పంద్రాగస్టు సినిమాలన్నింటి కంటే ముందుగా ఫలితం వచ్చేది ‘మిస్టర్ బచ్చన్‘కే.

పేరుకు రీమేక్ సినిమా అయినా.. తన మార్క్ మాస్ ఎలివేషన్స్, రొమాంటిక్ సీన్స్ తో ‘మిస్టర్ బచ్చన్‘ ను సమ్ థింగ్ స్పెషల్ గా తీర్చిదిద్దాడు డైరెక్టర్ హరీష్ శంకర్. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన రవితేజ, భాగ్యశ్రీ బోర్సే రొమాంటిక్, మాస్ సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ దక్కింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో ‘మిస్టర్ బచ్చన్‘ రూపొందింది.

సూపర్ డూపర్ హిట్ ‘ఇస్మార్ట్ శంకర్‘కి సీక్వెల్ గా రూపొందింది ‘డబుల్ ఇస్మార్ట్‘. ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘డబుల్ ఇస్మార్ట్‘.. పంద్రాగస్టు స్లాట్ లో ముందుగా బెర్త్ కన్ఫమ్ చేసుకుంది. ఎప్పుడైతే ‘పుష్ప 2‘ పక్కకు వెళుతోంది అనే సమాచారం వచ్చిందో.. ఆగస్టు 15న వచ్చేస్తున్నామంటూ ప్రకటన చేసింది ‘డబుల్ ఇస్మార్ట్‘ టీమ్.

‘ఇస్మార్ట్ శంకర్‘కి మించి డబుల్ డోస్ ఫన్, రొమాన్స్, యాక్షన్ తో రాబోతున్న ‘డబుల్ ఇస్మార్ట్‘ ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ కి విపరీతంగా కనెక్ట్ అయ్యింది. ఈ సినిమాలో రామ్ స్వాగ్, మేకోవర్ ఊర మాస్ గా ఉన్నాయి. హీరోయిన్ కావ్య థాపర్ అందాల విందు ని ప్రచార చిత్రాలలోనే చూశాము. రేపు థియేటర్లలో ‘డబుల్ ఇస్మార్ట్‘కి ఓ రేంజులో మాస్ జాతర ఉండబోతుందనే సంకేతాలు వస్తున్నాయి.

తెలుగు నుంచి రెండు పక్కా మాస్ మూవీస్ ‘మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్‘ మధ్య రాబోతుంది రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘ఆయ్‘. ఆద్యంతం గోదావరి జిల్లాల నేపథ్యంలో.. అక్కడ భాష, యాస లతో రూపొందిన చిత్రమిది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు, విద్యా కొప్పినీడి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో నార్నే నితిన్ హీరోగా నటించాడు. డెబ్యూ మూవీ ‘మ్యాడ్‘తో మంచి విజయాన్నందుకున్న నార్నే నితిన్.. ‘ఆయ్‘తో మరో హిట్ కొడతాననే కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు.

‘ఆయ్‘ సినిమాలో నార్నే నితిన్ కి జోడీగా నయన్ సారిక నటించింది. ఇతర కీలక పాత్రల్లో అంకిత్ కొయ్య, రాజ్ కుమార్ కసిరెడ్డి కనిపించబోతున్నారు. అజయ్ అరాసద సంగీతంలోని పాటలకు మంచి స్పందన లభించింది. అంజి కె. మణిపుత్ర దర్శకత్వంలో రూపొందిన ‘ఆయ్‘ చిత్రానికి మంచి బజ్ ఉంది.

ఇక.. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ‘తంగలాన్‘. విలక్షణ నటుడు విక్రమ్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ ఇది. తమిళ విలక్షణ దర్శకుడు పా.రంజిత్ తెరకెక్కించిన ఈ సినిమాలో పార్వతి తిరువోత్తు, మాళవిక మోహనన్ ఫీమేల్ లీడ్స్ లో కనిపించబోతున్నారు. ప్రీ ఇండిపెండెన్స్ బ్యాక్ డ్రాప్ తో రాబోతున్న ‘తంగలాన్‘ సరికొత్త అనుభూతిని అందిస్తుందనే భరోసాని ప్రచార చిత్రాలు కల్పించాయి. మొత్తంమీద.. రేపు విడుదలవుతోన్న నాలుగు చిత్రాల ఫలితాలు మరికొద్ది గంటల్లోనే తేలనున్నాయి.

ఇవీ చదవండి

English News