తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా ఫ్యామిలీకి ఎంతో ప్రత్యేకత ఉంది. మెగాస్టార్ చిరంజీవి మొదలుకొని ఈ కుటుంబం నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ వంటి వారు స్టార్ హీరోలుగా చక్రం తిప్పారు.. తిప్పుతున్నారు. ఇక.. చిరంజీవి కుటుంబానికి అనుబంధమైన అల్లు ఫ్యామిలీ కూడా మెగా ఫ్యామిలీగానే పిలవబడుతోంది. అల్లు కుటుంబానికి చెందిన అల్లు అర్జున్.. పాన్ ఇండియా స్థాయిలో ఐకాన్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. గతంలో పవన్ విషయంలో బన్నీ చేసిన ‘చెప్పను బ్రదర్’ అనే కామెంట్స్ ఈ రెండు కుటుంబాల ఫ్యాన్స్ మధ్య అంతరాన్ని పెంచాయి. ఆ తర్వాత మళ్లీ పలు వేదికల్లో పవన్ కళ్యాణ్‌కి బన్నీ సపోర్టు ఇవ్వడంతో ఆ అపొహలకు చెక్ పడింది.
అయితే.. గత కొన్ని సంవత్సరాలుగా మెగా-అల్లు కుటుంబాల మధ్య బంధం బలహీనపడిందనే విషయం బహిర్గతంగానే కనిపిస్తుంది. ఒకప్పుడు చిరంజీవి మొదలుకొని పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ వంటి వారు గీతా ఆర్ట్స్ లో ఎక్కువగా సినిమాలు చేయడానికి ఇష్టపడేవారు. కానీ.. కొన్ని సంవత్సరాలుగా మెగా హీరోలెవరూ గీతా ఆర్ట్స్ లో పనిచేయడం లేదు. చిరంజీవి, చరణ్ తమ సొంత బ్యానర్ తో పాటు.. గీతా ఆర్ట్స్ కాకుండా మిగతా ప్రొడక్షన్ హౌజెస్ కి ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు.
గత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పవన్ ప్రత్యర్థి పార్టీకి చెందిన వ్యక్తికి బన్నీ సపోర్ట్ చేయడంతో మళ్లీ సోషల్ మీడియా వేదికగా అల్లు-మెగా వైరం మొదలయ్యింది. అది కాస్తా ఇప్పుడు ముదిరి పాకాన పడింది. తాజాగా.. జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ బన్నీపై చేసిన కామెంట్స్ పెను దుమారాన్ని రేపుతున్నాయి.
ప్రత్యేకంగా అల్లు అర్జున్ కు ఫ్యాన్స్ ఉన్నారని తనకు తెలియదని.. అందరూ మెగాభిమానులే తప్ప ప్రత్యేకంగా షామియానా, టెంట్లు పెట్టుకున్న వాళ్ళ గురించి తనకు తెలియదని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని సృష్టిస్తున్నాయి. ఇక్కడుంది చిరంజీవి ఫ్యామిలీ, మెగా ఫ్యాన్స్ మాత్రమే అన్నారు. మెగా ఫ్యామిలీ నుంచి విడిపోయి ఎవరైనా షామియానా కంపెనీల్లాగా బ్రాంచ్ లు పెట్టుకున్నారేమో తమకు తెలియదన్నారు.
అల్లు అర్జున్ తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారన్నారు. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో గెలిచిందని, అల్లు అర్జున్ స్వయంగా వెళ్లి ప్రచారం చేసినా వైసీపీ అభ్యర్థి ఓడిపోయారని విమర్శించారు. నాకు ఇష్టముంటేనే వస్తా, నిన్ను ఎవరు రమ్మన్నారు. నువ్వు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? అల్లు అరవింద్ ఎంపీగా నిలబడితే గెలిపించుకోలేకపోయారు. మీరు అందర్నీ విమర్శించడం సరికాదు.. అంటూ బొలిశెట్టి శ్రీనివాస్ బన్నీపై వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే ‘మారుతినగర్ సుబ్రహ్మణ్యం’ ఈవెంట్ లో తన స్నేహితుల కోసం ఏమైనా చేస్తానని ఎంత దూరమైనా వెళ్తానని అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ మెగా ఫ్యాన్స్ ని బాగా రెచ్చగొట్టేలా చేశాయి.