ప్రముఖ సినీ నటి కస్తూరి తమిళనాడులోని తెలుగువారిపై చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో శనివారం ఆమెను అదుపులోకి తీసుకుని చెన్నైకి తరలించారు. చెన్నై ఎగ్మోర్ కోర్టు ఆమెను ఈ నెల 29 వరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపింది.
బ్రాహ్మణులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేస్తూ తెలుగువారిపై కస్తూరి అనుచిత వ్యాఖ్యలు చేశారు. సుమారు 300 ఏళ్ల క్రితం రాజుల పరిపాలనలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి తెలుగు వారు తమిళనాడుకు వచ్చారని ఆరోపించారు. ఇప్పుడు తమిళ జాతి అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడే తెలుగువారిని ఉద్దేశించి, ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పడానికి ఎవరు అర్హులని ప్రశ్నించారు.
కస్తూరి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపాయి. చెన్నైలోని తెలుగువారు ఆమెపై మండిపడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తరువాత కస్తూరి తెలుగువారికి క్షమాపణ చెప్పినప్పటికీ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.