మరో వీకెండ్ వచ్చేసింది. కాకపోతే ఈసారి థియేటర్లలో చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేవు. ఈ వారం థియేటర్లలోకి వచ్చిన సినిమాలన్నీ చిన్న చిత్రాలే. మరోవైపు.. ఓటీటీలో మాత్రం పలు సినిమాలు, సిరీస్ లు ఈ వారం స్ట్రీమింగ్ కి వచ్చేశాయి.
ముఖ్యంగా.. ఈ వారం ఓటీటీ ప్రియులకు ఆసక్తి కలిగించే చిత్రాలంటే ‘సత్యం సుందరం, స్వాగ్’ గురించి చెప్పుకోవాలి. ఇంకా.. బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్-4’, కృతి సనన్, కాజోల్ ‘దో పత్తి’, ‘ద లెజెండ్ ఆఫ్ హనుమాన్’ వంటివి కూడా ఈ వారం ఓటీటీ ప్రియులను ఆకట్టుకునే సిరీస్ లు, షో ల జాబితాలో ఉన్నాయి.
ముందుగా కార్తీ-అరవింద్ స్వామి సూపర్ హిట్ మూవీ ‘సత్యం సుందరం’ గురించి వద్దాం. ఈ చిత్రం ‘దేవర’ విడుదలైన సెప్టెంబర్ 27నే రిలీజైంది. తమిళంలో సెప్టెంబర్ 27నే వచ్చినా.. తెలుగులో మాత్రం సెప్టెంబర్ 28న విడుదలైంది. కార్తి, అరవింద్ స్వామి కలిసి నటించిన హృద్యమైన కుటుంబ కథా చిత్రమిది.
సూర్య, జ్యోతిక సంయుక్తంగా నిర్మించిన ‘సత్యం సుందరం’కి చాలా మంచి రివ్యూస్ వచ్చాయి. అయితే.. తమిళంలో విజయం సాధించినంతగా.. తెలుగులో అలరించలేకపోయింది. అందుకు ప్రధాన కారణం ‘దేవర’ సినిమా. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ వేదికగా ‘సత్యం సుందరం’ స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లలో మిస్సైన వారు ఈ హృద్యమైన సినిమాని ఇప్పుడు ఓటీటీలో ఆస్వాదించొచ్చు.
థియేటర్లలో మిక్స్‌డ్ రెస్పాన్స్ దక్కించుకున్న ‘స్వాగ్’ కూడా ఇప్పుడు సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. శ్రీ విష్ణు పలు విభిన్న గెటప్స్ లో నటించిన చిత్రమిది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో హాసిత్ గోలీ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. శ్వాగణిక వంశం అనే ఒక ప్రాచీన కుటుంబానికి చెందిన వారసత్వం కోసం సాగే పోరాటం నేపథ్యంలో ఆసక్తికర కథ, కథనాలతో ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రం ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతిని అందించడం అయితే పక్కా. ఈ మూవీలో రీతూ వర్మ, మీరా జాస్మిన్, దక్ష నగార్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవి బాబు, గెటప్ శ్రీను, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషించారు.
నటసింహం బాలకృష్ణ సూపర్ హిట్ టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ కొత్త సీజన్ ప్రారంభమైంది. ఆహా ఓటీటీ వేదికగా అక్టోబర్ 25 నుంచి ఈ సీజన్ ను షురూ చేశారు. ఫస్ట్ ఎపిసోడ్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందడి చేశారు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ కి ఆహాలో ట్రెమండస్ రెస్పాన్స్ దక్కుతుంది.