ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ హీరోలలోనే కాదు.. యంగ్ హీరోలను సైతం తలదన్నేలా వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు నటసింహం బాలకృష్ణ. అసలు వరుస ఫ్లాపుల తర్వాత బాలకృష్ణను మళ్లీ ఫామ్ లోకి తీసుకొచ్చిన చిత్రం ‘అఖండ‘. 2021, డిసెంబర్ 2న విడుదలైన ‘అఖండ‘ అద్భుతమైన విజయాన్ని సాధించింది.
బోయపాటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అఖండ రుద్ర సికందర్ ఘోరాగా పవర్ ఫుల్ అఘోర పాత్రలోనూ.. మురళీ కృష్ణ గా మరో క్యారెక్టర్ లోనూ డ్యుయల్ రోల్ లో దుమ్మురేపాడు నటసింహం. ఈ సినిమాలో అఘోర పాత్రలో బాలకృష్ణ నటన అయితే అత్యద్భుతం. ఆ క్యారెక్టర్ ను సినిమాలో ఓ రేంజులో ఎలివేట్ చేయడంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పాత్ర చాలా ఉంది.
‘అఖండ‘ సినిమా రీ రికార్డింగ్ కోసం చాలా రోజుల సమయమే తీసుకున్నాడు తమన్. అది.. సినిమా విడుదల తర్వాత తెరపై స్పష్టంగా వినిపించింది. ఇప్పటివరకూ తమన్ సంగీతాన్నందించిన సినిమాలన్నీ ఒకెత్తయితే.. ‘అఖండ‘ ఒక్కటే మరో ఎత్తు అనే రీతిలో ఆ చిత్రానికి నేపథ్య సంగీతాన్ని సమకూర్చాడు.
‘అఖండ‘ తర్వాత బాలకృష్ణ చేసిన, చేస్తున్న ప్రతీ సినిమాకీ తమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తుండడం విశేషమనే చెప్పాలి. ‘వీరసింహారెడ్డి‘ ఆ తర్వాత ‘భగవంత్ కేసరి‘.. ఇప్పుడు బాబీతో బాలకృష్ణ చేస్తున్న ‘ఎన్.బి.కె. 109‘కి సైతం తమన్ సంగీత దర్శకుడు కావడం విశేషం.
ప్రస్తుతం ‘అఖండ‘ సీక్వెల్ గా వస్తోన్న ‘అఖండ 2‘కి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ‘అఖండ‘ సినిమాకి మించిన రీతిలో ‘అఖండ 2‘లో అఘోర పాత్రలో బాలయ్య ఎలివేషన్స్, డైలాగ్స్ ఉంటాయని ఇప్పటికే డైరెక్టర్ బోయపాటి శ్రీను హింట్ ఇచ్చాడు. మరి బోయపాటి.. బాలయ్య తో చేయించే పవర్ ఫుల్ యాక్షన్ కి.. చెప్పించే పవర్ ఫుల్ డైలాగ్స్ కి తమన్ అందించబోయే స్కోర్ ఎలా ఉండబోతుందో.. మచ్చుకి ‘అఖండ 2‘ లోగో లాంఛ్ చూస్తే అర్థమవుతుంది.