నటుడు అనే పదానికి నిలువెత్తు నిదర్శనంలా ఉంటాడు విక్రమ్. ఇప్పటికే వెండితెరపై ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన విక్రమ్.. తాజాగా ‘తంగలాన్‘ అంటూ మరో వైవిధ్యభరిత పాత్రతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘తంగలాన్‘ చిత్రంపైనా మంచి బజ్ ఉంది.
పేరుకు తమిళ చిత్రమే అయినా.. ఈ సినిమాని తెలుగులో విపరీతంగా ప్రచారం చేశాడు విక్రమ్. సినిమా విడుదలకు ఒక రోజు ముందు వరకూ ‘తంగలాన్‘ టీమ్ తెలుగు రాష్ట్రాల్లో సందడి చేయడం ఓ విశేషమేనని చెప్పాలి.
తమిళంలో ‘అట్టకత్తి, మద్రాస్, కబాలి, కాలా, సార్పట్ట పరంబరై‘ వంటి సినిమాలను రూపొందించిన పా.రంజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. బ్రిటిషర్స్ పాలిస్తున్న సమయంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో ఈ సినిమాని పా.రంజిత్ తెరకెక్కించాడు.
విక్రమ్ లోని నట విశ్వరూపాన్ని ఆవిష్కరించే చిత్రంగా ‘తంగలాన్‘కి మంచి బజ్ ఉంది. ఈ సినిమాలో విక్రమ్ ఓ తెగ నాయకుడిగా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో విక్రమ్ ఆహార్యం, అతను చేసే వీరోచిత పోరాటాలు సినిమాకి హైలైట్ గా నిలుస్తాయంటున్నారు. ఇక.. సినిమా చివరిలో పులితో విక్రమ్ చేసే ఓ పారటం ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటుందట.
మలయాళీ స్టార్ పార్వతి తిరువోత్తు.. విక్రమ్ కి జోడీగా నటిస్తే.. మాళవిక మోహనన్ మాంత్రికురాలి పాత్రలో కనిపించబోతుంది. జి.వి.ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చాడు. స్టూడియో గ్రీన్ సంస్థ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ‘తంగలాన్‘ చిత్రాన్ని నిర్మించింది.