శ్రద్దా కపూర్, రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ‘స్త్రీ 2‘ మూవీ కలెక్షన్లలో ప్రభంజనం సృష్టిస్తోంది. హారర్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ‘స్త్రీ 2‘.. 2018లో వచ్చిన ‘స్త్రీ‘ సినిమాకి సీక్వెల్. ఒరిజినల్ ని డైరెక్ట్ చేసిన అమర్ కౌశిక్ దర్శకత్వంలోనే ఈ సినిమా రూపొందింది. వారం రోజుల్లో రూ.300 కోట్లను కలెక్ట్ చేసి బడా హిట్ దిశగా దూసుకెళ్తుంది ‘స్త్రీ 2‘.
కొన్నేళ్లుగా సరైన విజయాలు లేక సతమతమవుతోన్న బాలీవుడ్ ని.. గత ఏడాది రెండు సినిమాలతో గాడిన పడేశాడు షారుక్ ఖాన్. అతను నటించిన ‘జవాన్, పఠాన్‘ తర్వాత మళ్లీ బాలీవుడ్ కి మంచి విజయాన్నందించిన చిత్రంగా ‘స్త్రీ 2‘ నిలుస్తోంది. ఆగస్టు 15న విడుదలైన ‘స్త్రీ 2‘ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. శని, ఆదివారాలతో పాటు సోమవారం కృష్ణాష్టమి ఫెస్టివల్ కలిసి రావడంతో ‘స్త్రీ 2‘ వసూళ్లకు ఢోకా ఉండదని చెప్పొచ్చు.
మొత్తంగా.. ఇప్పటికే రూ.300 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టిన ‘స్త్రీ 2‘ లాంగ్ రన్ లో రూ.500 నుంచి రూ.600 కోట్లు వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు బాలీవుడ్ ట్రేడ్ పండిట్స్.