తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్. ఒకప్పుడు ప్రెసిడెంట్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నిక జరిగేది. నలుగురు పెద్దలు కూర్చుని ఎవరిని అధ్యక్షులుగా నియమిస్తే వాళ్లే ఆ పదవిలో ఉండేవారు. తర్వాత పరిస్థితులు మారాయి. అధ్యక్ష పదవికి పోటీ పెరిగింది. ఎవరికి వారు మేముండాలి అంటే మేముండాలి అంటూ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.
ఇప్పుడు సి కళ్యాణ్, దిల్ రాజు ప్యానెల్స్ బరిలోకి దిగుతున్నాయి. ఈ నెల 30న కౌన్సిల్ కు ఎన్నిక జరగబోతోంది. ఇప్పటికే సార్వత్రిక ఎన్నిల్లాగా హోరాహోరీగా ప్రచారాలు, కౌంటర్లు, ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయి. ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది పక్కన బెడితే.. ఈ సారి కౌన్సిల్ ఎన్నికలకు ఇండస్ట్రీలో 50యేళ్లు పూర్తి చేసుకున్న ప్రధానమైన పెద్ద నిర్మాణ సంస్థలు దూరంగా ఉండటం విశేషం.
యస్.. తెలుగు సినిమా చరిత్రలో తమకంటూ ఓ అధ్యాయాన్ని క్రియేట్ చేసుకున్న వైజయంతీ మూవీస్, గీతా ఆర్ట్స్, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ ఈ సారి కౌన్సిల్ ఎన్నికలకు పూర్తిగా దూరంగా ఉన్నాయి.
సురేష్ బాబు, అల్లు అరవింద్, అశ్వనీదత్.. ఈ ముగ్గురూ ఈ తతంగానికి దూరంగా ఉండటం ఆశ్చర్యంగా ఉంది.
ఒకప్పుడు వీరు కౌన్సిల్ ను శాసించిన వారే. తాము చెప్పింది చెప్పినట్టుగా పరిశ్రమకు మేలు చేయడానికి ప్రయత్నించిన వారే. కానీ ఇప్పుడు ఎందుకు దూరంగా ఉన్నారు అనేది అర్థం కావడం లేదు అని కొంతమంది అనుకుంటున్నారు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏం లేదు.
జరుగుతున్న ఎన్నికల సరళీ, పోటీ పడుతున్న వారిని చూస్తే రెండు విషయాలు స్పష్టంగా అర్థం అవుతాయి. వీరిలో నిత్యం సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న వాళ్లు గెలిస్తే .. వాళ్లు కౌన్సిల్ కు టైమ్ ఇవ్వలేరు. సమస్యలు పరిష్కరించలేరు. అంత టైమ్ వారికి ఉండదు. ఇక సినిమాలు తీయకపోయినా సీనియర్ ప్రొడ్యూసర్స్ గెలిస్తే.. వీరి మాటను పూర్తిగా అమలు చేయడానికి ఓడిపోయిన వారు ముందుకు రారు. అన్ని విషయాల్లోనూ ఆటంకాలు కలిగిస్తారు. దీనివల్ల ఎన్నికలు అనేది ఓ స్టంట్ లా ఉంటుందే తప్ప.. నిజంగా నిర్మాతలకు, వీరి ద్వారా డిస్ట్రిబ్యూటర్స్ కు ఒరిగే మేలు ఏమీ ఉండదు అనేది నిజం. ఆ నిజం అర్థమైంది కాబట్టే.. యాభైయేళ్లుగా పరిశ్రమలో ఉంటున్న వీరు పూర్తిగా ఆ తతంగానికి దూరం అయ్యారు.