యాక్షన్ లో చెలరేగిపోతున్న సీనియర్ బ్యూటీస్

హీరోయిన్స్ ను గ్లామర్ డాల్స్ గా అభివర్ణిస్తుంటారు. అయితే.. తాము కేవలం గ్లామర్ మాత్రమే కాదు.. యాక్షన్ లోనూ చెలరేగిపోతామంటున్నారు నేటితరం భామలు. హీరోలకు దీటుగా స్టంట్స్ లో రాణించడానికి భారీ స్థాయిలో కసరత్తులు కూడా చేస్తున్నారు.

సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్ గా పీక్స్ చూసిన సమంత.. వెబ్ దునియాలోనూ మంచి పాపులారిటీ దక్కించుకుంది. సామ్ నటించిన వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్-2’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ సిరీస్ లో సమంత చేసిన యాక్షన్ పీక్స్ లో ఉంటుంది. ఆ తర్వాత మయోసైటిస్ వ్యాధి బారిన పడడంతో సినిమాలను తగ్గించేసింది.

ఇటీవల తన బర్త్ డే స్పెషల్ గా ‘బంగారం’ టైటిల్ తో ఓన్ బ్యానర్ లో మూవీని అనౌన్స్ చేసింది సమంత. ఈ మూవీ అనౌన్స్‌మెంట్ పోస్టర్ లోనే గన్ పట్టుకుని కనిపించింది. దీనిని బట్టి ఈ సినిమా ఆద్యంతం యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్ లో ఉండబోతున్నట్టు అర్థమవుతోంది.

మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఫుల్ లెన్త్ యాక్షన్ లో చెలరేగిపోవడానికి సిద్ధమవుతోంది. డైరెక్టర్ సంపత్ నంది నిర్మాణంలో మంచి విజయాన్ని సాధించిన ‘ఓదెల రైల్వే స్టేషన్’ చిత్రానికి సీక్వెల్ గా ‘ఓదెల 2’ రూపొందుతోంది. ఈ సినిమాలో తమన్నా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ‘ఓదెల 2’లో శివశక్తిగా పవర్ ఫుల్ రోల్ లో తమన్నా కనిపించబోతుంది. ఈ మూవీలో తమన్నా చేసే యాక్షన్ సీక్వెన్సెస్ బాగా ఆకట్టుకుంటాయట.

మరో సీనియర్ బ్యూటీ కాజల్ అగర్వాల్ పవర్‌ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించబోతున్న చిత్రం ‘సత్యభామ’. సుమన్ చిక్కాల దర్శకత్వంలో బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కడపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో ‘సత్యభామ’పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి.. ఈ మూవీలో పోలీస్ గా కాజల్ చేసే సాహసాలు ఏ రేంజులో ఉంటాయో తెలియాలంటే ఈ నెల చివరన సినిమా విడుదలయ్యే వరకూ ఆగాల్సిందే.

అందాల తార అనుష్క, విలక్షణ దర్శకుడు క్రిష్ కలయికలో రూపొందుతోన్న ‘ఘాటి’ సినిమా కూడా ఆద్యంతం యాక్షన్ బ్యాక్‌డ్రాప్ లో ఉండబోతుందట. ఇప్పటికే ‘అరుంధతి, బాహుబలి’ వంటి సినిమాల్లో తన యాక్షన్ ను పీక్స్ లో చూపించిన స్వీటీ.. ‘ఘాటి’లోనూ తన యాక్షన్ తో అదరగొట్టనుందట. నేరస్తురాలిగా మారిన ఓ బాధితురాలి కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

మరో అందాల తార శ్రుతి హాసన్ కూడా ‘డెకాయిట్’ సినిమాకోసం యాక్షన్ బాట పడుతోంది. అడవి శేష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా యాక్షన్ అంశాలతో ఓ డిఫరెంట్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది. షానియల్ డియో తెరకెక్కిస్తున్న ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తుంది.

Related Posts