భిన్న పాత్రలతో మంచి నటుడిగా సత్య దేవ్ తెలుగు ప్రేక్షకుల్లో ముద్ర వేశారు. విలన్‌గానూ సత్య దేవ్ అందరినీ మెప్పించారు. ప్రస్తుతం మరో కొత్త సినిమాతో సత్య దేవ్ అందరినీ పలకరించబోతోన్నారు. ఫుల్ బాటిల్ అంటూ రాబోతోన్న ఈ చిత్రాన్ని రామాంజనేయులు జవ్వాజి, ఎస్‌డీ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. స్రవంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ మీద ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.శరణ్ కొప్పిశెట్టి ఈ ఫుల్ బాటిల్ సినిమాకు డిఫరెంట్ స్టోరీ, స్క్రీన్ ప్లేతో కొత్తగా తెరకెక్కించారు. ఈ మధ్యే విడుదల చేసిన ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్ అందరినీ మెప్పించింది. ఆ పోస్టర్‌కు విశేషమైన స్పందన లభించింది. ఇక నేడు ఈ సినిమా నుంచి సత్య దేవ్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.ఫస్ట్ లుక్ పోస్టర్లో సత్యదేవ్‌ను చూస్తుంటే.. ఈ చిత్రం పూర్తిగా వినోదాత్మకంగా తెరకెక్కించినట్టు కనిపిస్తోంది.

పోస్టర్‌లో కాకినాడ పరిసర ప్రాంతాలు, ఆటో, సత్యదేవ్ కళ్లజోడు ఇవన్నీ చూస్తుంటే ఫుల్ ఫన్ గ్యారెంటీ అనిపిస్తోంది. మెర్క్యూరీ సూరి పాత్రలో సత్య దేవ్ అందరినీ అలరించనున్నాడు. సినిమా ఎంత వినోదాత్మకంగా ఉండబోతోందో ఈ పోస్టర్ చెప్పకనే చెప్పేసింది.సత్య దేవ్ ప్రస్తుతం గాడ్ ఫాదర్, రామ్ సేతు వంటి సినిమాలతో ఆడియెన్స్‌ను మెప్పించారు. ఈ రెండు చిత్రాల్లో అద్భుతమైన నటనను కనబర్చిన సత్య దేవ్.. ఈ సినిమాతో మరోసారి సర్ ప్రైజ్ చేయనున్నారు. తిమ్మరుసు సినిమాత తరువాత మళ్లీ సత్యదేవ్, శరణ్ కొప్పిశెట్టి కలిసి చేస్తోన్న చిత్రమిది. రీసెంట్‌గానే ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో సినిమా మీద మంచి అంచనాలు పెంచింది చిత్రయూనిట్.ఈ చిత్రానికి సుజాత సిద్దార్థ్ సినిమాటోగ్రాఫర్‌గా, సంతోష్ కామిరెడ్డి ఎడిటర్‌గా, నవీన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. తేజ్ దిలీప్ విజువల్ ఎఫెక్ట్స్ బాధ్యతలు చూస్తుండగా.. రమణ మాధవరం కో డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.