HomeMoviesటాలీవుడ్'భజే వాయు వేగం' రివ్యూ

‘భజే వాయు వేగం’ రివ్యూ

-

నటీనటులు: కార్తికేయ, ఐశ్వర్య మీనన్, రాహుల్ టైసన్, తనికెళ్ల భరణి, రవి శంకర్, శరత్ లోహిత్స్వ తదితరులు
సినిమాటోగ్రఫి: ఆర్.డి. రాజశేఖర్
సంగీతం: రాధన్, కపిల్ కుమార్ జమ్ముల
ఎడిటింగ్‌: సత్య .జి
నిర్మాతలు: యు.వి. కాన్సెప్ట్స్
దర్శకత్వం: ప్రశాంత్ రెడ్డి
విడుదల తేది: 31-05-2024

టాలీవుడ్ హీరోస్ లో మంచి ఫిట్ బాడీతో యాక్షన్ ఎంటర్ టైనర్స్ కు పర్ఫెక్ట్ గా సూటయ్యే కథానాయకుడు కార్తికేయ. ఈ యంగ్ హీరో నటించిన లేటెస్ట్ మూవీ ‘భజే వాయు వేగం‘. యు.వి.క్రియేషన్స్ వంటి బడా ప్రొడక్షన్ హజ్ ఈ సినిమాని నిర్మించింది. ఈ సినిమాలో కార్తికేయ కి జోడీగా ఐశ్వర్య మీనన్ నటించింది. ఇతర కీలక పాత్రల్లో ‘హ్యాపీడేస్‘ ఫేమ్ రాహుల్ టైసన్, తనికెళ్ల భరణి, రవి శంకర్, శరత్ లోహిత్సవ వంటి వారు నటించారు.

ప్రచార చిత్రాలతో ‘భజే వాయు వేగం’ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. మరి.. ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘భజే వాయు వేగం’ ఎలా ఉంది? ఈ రివ్యూలో చూద్దాం.

కథ
వరంగల్ లోని రాజన్న పేట గ్రామంలో వెంకట్ (కార్తికేయ) తల్లిదండ్రులు నివసిస్తుంటారు. వెంకట్ చిన్న వయసులోనే అతని తల్లిదండ్రులు అప్పులు బాధతో ఆత్మహత్య చేసుకుంటారు. వెంకట్ ని తన తండ్రి స్నేహితుడు (తనికెళ్లి భరణి) దత్తత తీసుకుంటాడు. అప్పటికే ఆయనకి ఒక కొడుకు ఉంటాడు. పేరు వెంకట్ (రాహుల్ టైసన్). సొంత కొడుకు, దత్తత తీసుకున్న కొడుకు అని కాకుండా.. ఇద్దరినీ సమ ప్రేమతో పెంచి పెద్ద చేస్తాడు.

కెరీర్ వెతుక్కుంటూ హైదరాబాద్ వెళ్లిన ఈ అన్నాదమ్ములిద్దరికీ.. సిటీలో ఎలాంటి అవరోధాలు ఎదురయ్యాయి? హైదరబాద్ ను ఏలుతున్న బ్రదర్స్ డేవిడ్ (రవి శంకర్), జార్జ్ (శరత్ లోహిత్స్వ)కి వీరికి వచ్చిన గొడవ ఏంటి? మధ్యలో ఏ 56 డ్రగ్ రాకెట్ ని నడిపిస్తుంది ఎవరు? ఇందు (ఐశ్వర్య మీనన్) పాత్ర ఏంటి? వంటి విశేషాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ
ఈ చిత్రం ట్రైలర్ విడుదలైనప్పుడే ఇదొక రేసీ ఎంటర్ టైనర్ గా అనిపించింది. అలాగే.. ఈ మూవీని అంతే ప్రామిసింగ్ గా తెరపైకి తీసుకొచ్చాడు డెబ్యూ డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి. ప్రస్తుతం కొంతమంది యువకులు బెట్టింగ్స్ కు ఎలా బానసలు అవుతున్నారు అనే అంశాలను కూడా ఇందులో టచ్ చేశాడు డైరెక్టర్.

ఫస్టాఫ్ లోని కొన్ని సన్నివేశాలు, హీరోహీరోయిన్ల లవ్ ట్రాక్ రొటీన్ గా అనిపించినా.. సినిమా ఇంటర్వెల్ నుంచి ఊపుందుకుంటోంది. సెకండాఫ్ మొత్తం చాలా ఉత్కంఠభరితంగా సాగుతోంది. అయితే.. క్లైమాక్స్ ను మాత్రం రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్‌లో ముగించడం కాస్త అసంతృప్తికి గురిచేసే అంశం.

నటీనటులు, సాంకేతిక నిపుణులు
‘ఆర్.ఎక్స్.100‘ తర్వాత కార్తికేయకి మళ్లీ అలాంటి ఇంటెన్స్ రోల్ ఈ సినిమాలో దక్కింది. కొన్ని సన్నివేశాల్లో సెటిల్డ్ పెర్ఫామెన్స్ తోనూ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా.. యాక్షన్ సీక్వెన్సెస్ లో కార్తికేయ అదరగొట్టాడనే చెప్పొచ్చు. హీరోయిన్ ఐశ్వర్య మీనన్ కి పెద్దగా స్కోప్ లేకపోయినా.. ఉన్నంతలో ఫర్వాలేదనిపించింది.

ఇక.. ‘హ్యాపీడేస్‘ తర్వాత కొన్ని సినిమాలు చేసినా.. రాహుల్ టైసన్ కి మంచి పాత్రలైతే పడలేదు. ఆ కోరికను కొంత వరకూ ‘భజే వాయు వేగం‘ తీర్చిందని చెప్పొచ్చు. ఈ సినిమాలో వెంకట్ పాత్రలో రాహుల్ టైసన్ గుర్తిండిపోతాడు. ఇంకా.. తనికెళ్ల భరణి, రవి శంకర్, శరత్ లోహిత్సవ లు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.సాంకేతిక నిపుణుల విషయానికొస్తే.. తొలి చిత్రమే అయినా దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ సినిమాతో ఫుల్ మార్కుల్లో పాస్ అయ్యాడని చెప్పొచ్చు. రధన్ సాంగ్స్, కపిల్ కుమార్ జమ్ముల బి.జి.ఎమ్, ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అన్నీ టాప్ క్లాస్ లో ఉన్నాయి.

చివరగా
మొత్తంగా.. ‘భజే వాయు వేగం‘ టైటిల్ కి తగ్గట్టే.. మంచి క్రైమ్ థ్రిల్లర్ ను చూసిన అనుభూతిని ఈ సినిమా అందిస్తుంది.

రేటింగ్:2.75/ 5

ఇవీ చదవండి

English News