గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ సంక్రాంతి బరిలో విడుదలకు ముస్తాబవుతుంది. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించి టీజర్ ను లక్నో వేదికగా విడుదల చేశారు. డిసెంబర్ నుంచి ‘గేమ్ ఛేంజర్’ ప్రచారాన్ని వేగవంతం చేయనుంది టీమ్. లేటెస్ట్ గా చరణ్ తన తర్వాతి సినిమాని మొదలు పెట్టడానికి సిద్ధమవుతున్నాడు.
బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ 16వ సినిమా తెరకెక్కబోతుంది. ఇప్పటికే పక్కాగా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకున్న ఈ సినిమా నవంబర్ 22 నుంచి మైసూర్ లో ప్రారంభమవుతుందట. తొలి షెడ్యూల్ లో హీరోహీరోయిన్లు రామ్ చరణ్, జాన్వీ కపూర్ లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తాడట డైరెక్టర్ బుచ్చిబాబు.
ఆద్యంతం ఉత్తరాంధ్ర నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో చరణ్ ఓ క్రీడాకారుడిగా కనిపించబోతున్నాడు. స్పోర్ట్స్ మ్యాన్ లుక్ కోసం చెర్రీ స్పెషల్ గా మేకోవర్ అయ్యాడు. ఆస్కార్ విజేత ఏ.ఆర్.రెహమాన్ ఈ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేస్తుండగా.. స్టార్ కెమెరామేన్ రత్నవేలు సినిమాటోగ్రఫీ సమకూర్చనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా RC16 ని నిర్మిస్తున్నాయి.