రామబాణం వర్సెస్ ఉగ్రం.. బాక్సాఫీస్ విన్నర్ ఎవరు..?

మేచో స్టార్ గోపీచంద్, డింపుల్ హయాతీ జంటగా నటించిన సినిమా రామబాణం. గోపీచంద్ తో గతంలో లక్ష్యం, లౌక్యం వంటి సూపర్ హిట్ మూవీస్ తీసిన శ్రీవాస్ ఈ చిత్రానికి దర్శకుడు. జగపతిబాబు, ఖుష్బూ మరో ప్రధాన జంటగా కనిపించబోతున్నారు.

అన్నదమ్ముల బాండింగ్ తో పాటు డిఫరెంట్ ఎమోషన్స్ ను డీల్ చేస్తూ ఎంటర్టైన్మెంట్ మిస్ కాకుండా కంప్లీట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రాన్ని రూపొందించినట్టు ప్రమోషన్స్ లో చెబుతున్నారు. ట్రైలర్ ఇంపాక్ట్ భారీగా ఉంది అని చెప్పలేం కానీ.. గోపీచంద్ నుంచి మాస్ కోరుకునే అంశాలు కనిపిస్తున్నాయి. ఇవి ఎమోషనల్ గా ఎంత వరకూ కనెక్ట్ అవుతాయి అనేదాన్ని బట్టి సినిమా విజయం ఆధారపడి ఉంటుంది.

అయితే పాటలు పెద్దగా ఆకట్టుకునేలా లేవు. అలాగే జగపతిబాబు పాత్ర ట్రైలర్ లో చూస్తేనే ఊహించే విధంగా కనిపిస్తోంది. ఆ పాత్ర నుంచి ఊహలకు భిన్నంగా ఏదైనా ట్విస్ట్ లు ఉంటే తప్ప ఆడియన్స్ కు కనెక్ట్ కాదు. బట్ ఇటు గోపీచంద్ తో పాటు దర్శకుడు శ్రీవాస్ కూడా ఒక బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్నారు. ఇది వారి నమ్మకాన్ని నిలబెడుతుందని చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. మరి వారి నమ్మకం నిజం అయ్యి.. రామబాణం బాక్సాఫీస్ టార్గెట్ లో సూపర్ హిట్ అనే పక్షి కన్నును ఛేదిస్తుందా లేదా అనేది చూడాలి.


ఇక రామబాణంతో పాటుగా ఫస్ట్ టైమ్ కంప్లీట్ మాస్ యాక్షన్ తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు అల్లరి నరేష్అలియాస్ నాంది నరేష్. పైగా టైటిల్ కూడా తన ఇమేజ్ కు పూర్తి భిన్నంగా ఉగ్రమ్ అని పెట్టారు. ఇంతకు ముందు నాందితో విమర్శకులను కూడా మెప్పించిన విజయ్ కనకమేడల ఈ చిత్రానికి దర్శకుడు. ఓ సామాజిక అంశాన్ని విశ్లేషిస్తూ.. కంప్లీట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రాన్ని రూపొందించినట్టు చెబుతున్నారు.

ప్రమోషన్స్ లో ఈ మూవీ చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వెంటాడుతుంది అంటున్నారు. మరి అంత గొప్ప ఎలిమెంట్స్ చిత్రంలో ఏమి ఉన్నాయో కానీ.. ఉగ్రమ్ కు రామబాణం నుంచి గట్టి పోటీ అయితే ఉంది. అఫ్‌ కోర్స్ రామబాణానికి కూడా నరేష్ నుంచి పోటీ ఎదురవుతుంది. కొన్నాళ్లుగా నరేష్ ఎంచుకుంటోన్న సబ్జెక్ట్స్ అతని గత ఇమేజ్ పూర్తిగా దాటి కనిపిస్తున్నాయి. మరి ఈ చిత్రం కూడా అతనికి కొత్త ఇమేజ్ ను ఇస్తూ.. రామబాణం పోటీని తట్టుకుని బాక్సాఫీస్ బరిలో విజయకేతనం ఎగురవేస్తుందా లేదా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.

Related Posts