69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకి అవార్డుల పంట పండిన విషయం తెలిసిందే. తాజాగా జాతీయ అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీ రాష్ట్రపతి భవన్ లో జరిగింది. పుష్ప సినిమాలో నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికైన అల్లు అర్జున్ అవార్డు అందుకున్నాడు. తెలుగు నటుడు జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపిక కావడం ఇదే మొదటిసార.

దేశవ్యాప్తంగా పుష్ప సినిమాలోని పాటలు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ సినిమాకు ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవీశ్రీ ప్రసాద్‌కు జాతీయ అవార్డు దక్కింది. ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డును రాష్ట్రపతి చేతులమీదుగా దేవిశ్రీ ప్రసాద్ అందుకున్నాడు.

తెలుగు సినిమాను ప్రపంచ పటాన నిలబెట్టిన ‘ఆర్.ఆర్.ఆర్‘ సినిమాకు ఆవార్డుల పంట పండిన విషయం తెలిసిందే. మొత్తంగా ‘ఆర్.ఆర్.ఆర్‘కు ఆరు విభాగాల్లో అవార్డులు దక్కాయి. జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రేక్షకాదరణ పొందిన చిత్రంగా ‘ఆర్.ఆర్.ఆర్‘ నిలిచింది. ఉత్తమ నేపథ్య సంగీతం విభాగంలో కీరవాణి అవార్డులు అందుకున్నారు.
‘ఆర్.ఆర్.ఆర్‘ చిత్రానికి ఉత్తమ స్టంట్ కొరియో గ్రాఫర్‌గా కింగ్ సాల్మన్.. ‘నాటు నాటు‘ పాటకు గాను ఉత్తమ డ్యాన్స్ కొరియో గ్రాఫర్‌గా ప్రేమరక్షిత్ అవార్డు పొందారు. ఈ సినిమాకి ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్‌గా శ్రీనివాస మోహన్, ఉత్తమ గాయకుడిగా కాలభైరవ అవార్డులు పొందారు.
ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘ఉప్పెన‘ సినిమాకి అవార్డు లభించింది. ఈ అవార్డును నిర్మాత నవీన్ అందుకున్నారు. వైష్ణవ్ తేజ్ నటించిన మరో చిత్రం ‘కొండపొలం‘లోని ధమ్ ధమ్ ధమ్ పాటకు గాను ఉత్తమ గీత రచయితగా చంద్రబోస్.. రాష్ట్రపతి చేతులమీదుగా జాతీయ అవార్డు అందుకున్నారు.