ప్రముఖ నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి కుటుంబానికి తీరని విషాదం నెలకొంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమార్తె, శ్యాం ప్రసాద్ రెడ్డి సతీమణి వరలక్ష్మి (62) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె.. బుధవారం రాత్రి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వరలక్ష్మి మృతికి టాలీవుడ్ వర్గాలు తీవ్ర సంతాపం తెలియజేస్తున్నాయి. ఈరోజు సాయంత్రం వరలక్ష్మి అంత్యక్రియలు హైదరాబాద్ లో జరగనున్నాయి.
శ్యాం ప్రసాద్ రెడ్డి టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాతగా గుర్తింపు పొందారు. మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్ స్థాపించి పలు సీరియల్స్‌తో పాటు టీవీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆయన నిర్మించిన ‘తలంబ్రాలు, ఆహుతి, అంకుశం, అమ్మోరు, అంజి, అరుంధతి’ వంటి సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. ప్రస్తుతం సినిమాలను పక్కన పెట్టినా.. బుల్లితెరపై పలు కార్యక్రమాలతో మల్లెమాల కొనసాగుతుంది.