ప్రజా యుద్ధనౌక గద్దర్ కన్నుమూశారు. కొంత కాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజుల క్రితమే తను డాక్టర్ పర్యవేక్షణలో ఉన్నానని త్వరలోనే కోలుకుని మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వస్తానని ఒక నోట్ పంంపించారు. ఇంతలోనే ఆయన మరణవార్త తెలిసింది. గద్దర్ గా జనజీవనానికి తెలిసిన ఆయన అసలు పేరు గుమ్మడి విఠల్ రావు.తూప్రాన్ లో జన్మించారు. ఉస్మానియా యూనివర్శిటీలో ఇంజినీరింగ్ పట్టా అందుకున్న ఉన్నత విద్యావంతుడు ఆయన. చదువుకుంటున్న దశలోనే విప్లవ రాజకీయాల వైపు ఆకర్షితులయ్యారు. పీపుల్స్ పార్టీతో కలిసి అడుగులు వేశారు. నూతన ప్రజాస్వామ్యం ఆకాంక్షగా మొదలైన కమ్యూనిస్ట్ ఉద్యమాలకు పాటగా మారాడు. తూటాలు కూడా చేయలేని పనిని పాటతో చేసి ఎన్నో ఉద్యమాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. 90ల్లో ఆయనపై కొందరు దుండగులు తుపాకులతో కాల్పులు జరిపారు.ఏడు తూటాలు శరీరంలో దిగాయి. వాటిలో ఆరింటిని వైద్యులు తొలగించినా.. వెన్నెముకలో ఉన్న తూటా తొలగిస్తే ప్రాణాలకే ప్రమాదం అని అలాగే ఉంచారు. ఇన్నాళ్లూ ఒంట్లో తూటాతోనే ఉన్నారాయన.
పీపుల్స్ వార్ పార్టీలో ఉంటూ అనేకమంది యువతరాన్ని అభ్యుదయ రాజకీయాలవైపు వచ్చేలా చేశారు. ఆయన పాట వినని తెలుగు నేల లేదు. ఆశు కవిత్వం చెప్పినట్టుగా అప్పటికప్పుడు అనేక సమస్యలు, సంఘటనలపై పాటలు అల్లి ప్రజా సమస్యలపై గళమెత్తారు. ఒక దశ దాటిన తర్వాత నక్సలైట్ ఉద్యమాల నుంచి బయటకు వచ్చారు. సానుభూతి పరుడుగా ఉంటూనే తెలంగాణ మలిదశ ఉద్యమానికి చుక్కానిగ నిలిచారు. మలిదశ ఉద్యమాన్ని ఉరకలెత్తించిన పాటకు ఆయనే నాయకత్వం వహించారు.ఆ తర్వాత ఆ బాధ్యత మరెందరో కళాకారులు అందిపుచ్చుకుని అడుగులు కదిపారు.
నేటి ఎంతోమంగి ప్రజా గాయకులకు గద్దర్ ఆరాధ్యుడు. ఆయన స్ఫూర్తిగా పాటలు అల్లినవారు ఎందరో. ఆయన తయారు చేసిన కవులు, కళాకారులకు లెక్కేలేదు. ఆంధ్రదేశంలో వంగపండు.. తెలంగాణ నుంచి గద్దర్.. ఇద్దరూ పీపుల్ వార్, జనశక్తి పార్టీల కోసం పనిచేశారు. విప్లవ రచయితల సంఘం మొదలుకొని అనేక సంఘాలను ప్రజాక్షేమం కోసం నిర్మించారు.పీపుల్స్ వార్ పార్టీ కోసం వంగపండుతో కలిసి జన నాట్యమండలిని స్థాపించి ఊరూరా తిరిగి ఉద్యమ బావుటాలనెగరేశారు. పాటై సమస్య ఉన్న ప్రతి చోటా నిలిచారు.
ఆయన పాటలు ఎన్నో ప్రజా ఉద్యమాలను నిర్మించాయి. నాయకులను తయారు చేశాయి. అలాగే సినిమాల్లోనూ తన పేరు పెట్టకుండా ఎన్నో పాటలు అందించారు. అయినా మా భూమి చిత్రంలోని బండెనక బండి కట్టి అనే పాటతో బాగా పాపులర్ అయ్యారు. ఒరేయ్ రిక్షా చిత్రంలో రెండు పాటలు తప్ప అన్నీ ఆయనే రాశారు. వీటిలో మల్లెతీగకు పందిరివోలే అనే పాటకు ఉత్తమ రచయితగా నంది పురస్కారం వచ్చింది.
జై బోలో తెలంగాణలోని పొడుస్తున్న పొద్దుమీద అనే పాట ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ప్రార్థన గీతంలా మారిందంటే అతిశయోక్తి కాదు. ఈ పాటకూ నంది అవార్డ్ రావడం విశేషం.
కొన్నాళ్లుగా పలు రాజకీయ పార్టీలకు మద్దతుగా నిలుస్తున్నారు.ఈ మధ్యే తనూ ఓ పార్టీ స్థాపించానని చెప్పాడు. బట్.. హృదయ సంబంధిత సమస్యతో హాస్పిటల్ లో చేరిన ఆయన ఆఖరి శ్వాస విడిచారు.