తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతి ఇప్పుడు దశదిశలా వ్యాపించింది. ఇండియాలోని టాప్-10 హీరోలలో ఐదుగురు టాలీవుడ్ నుంచే ఉన్నారు. ఇలాంటి సమయంలో.. తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నతి కోసం హీరోలు కూడా ఇగోలు పక్కనపెట్టి.. సరికొత్త కథలవైపు మొగ్గు చూపుతున్నారు. ఈకోవలోనే.. లేటెస్ట్ గా ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.. చిరంజీవి-బాలకృష్ణ మల్టీస్టారర్.
గతంలో ఎన్టీఆర్-ఏఎన్నార్, కృష్ణ-శోభన్ బాబు వంటి ముందు తరం నటులు పదుల సంఖ్యలో మల్టీస్టారర్స్ చేశారు. కానీ.. ఆ తర్వాతి తరంలోని నటులైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ కలయికలో మల్టీస్టారర్ రాలేదు. అయితే.. ఇప్పుడు బాలయ్య-చిరు కాంబోలో మల్టీస్టారర్ కి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.
అప్పట్లో ‘అన్‌స్టాపబుల్’ ప్రోగ్రామ్ లో చిరంజీవి-బాలకృష్ణ ఇద్దరితోనూ మెగా మల్టీస్టారర్ చేస్తానని మాటిచ్చారు అల్లు అరవింద్. ఇక.. లేటెస్ట్ గా బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవ వేడుకలో చిరంజీవి కూడా ఇదే మాట అన్నారు. తన ‘ఇంద్ర’ సినిమాకి బాలకృష్ణ ‘సమరసింహారెడ్డి’ ప్రేరణ అని.. బాలయ్య ఒప్పుకుంటే.. తాను అతనితో కలిసి ఓ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్ తో కూడిన మల్టీస్టారర్ చేయడానికి రెడీ అంటూ ముందుకొచ్చాడు మెగాస్టార్. అందుకు నటసింహం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
మరి.. నందమూరి-మెగా కలయికలో ఇప్పటికే ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి పాన్ వరల్డ్ మూవీ వచ్చింది. ఇప్పుడు చిరు-బాలయ్య కలయికలోనూ మరో మెగా మల్టీస్టారర్ కి శ్రీకారం జరుగుతుందేమో చూడాలి.