మామా అల్లుళ్లు ఇద్దరూ కలిసి ఓ ఫుల్ లెంగ్త్ సినిమాలో కలిసి నటిస్తున్నారు అన్నప్పుడే హైప్ వచ్చింది. బట్ ఆ హైప్ ను నిలబెట్టుకోవడంలో బ్రో మూవీ మేకర్స్ ఫెయిల్ అయ్యారా అనే డిస్కషన్స్ నడుస్తున్నాయి. మరో పది రోజుల్లో సినిమా విడుదల. బట్ ఇప్పటి వరకూ ఈ సినిమాకు సంబంధించి ఒక్క హై మూమెంట్ ఇచ్చే విషయం కూడా రిలీజ్ కాలేదు. అప్డేట్ చేయలేదు. రీసెంట్ గా విడుదల చేసిన రెండు పాటలూ జస్ట్ యావరేజ్ అనిపించుకున్నాయి.
ముఖ్యంగా మై డియర్ మార్కండేయ అస్సలు ఆకట్టుకోలేదు. తర్వాత వచ్చిన సాయితేజ్, కేతిక శర్మల డ్యూయొట్ అదో రకంగా ఉంది అనే టాక్ తెచ్చుకుంది. కొన్నాళ్ల క్రితం విడుదల చేసిన టీజర్ లో సైతం పెద్దగా మెరుపులేం లేవు. వీటికి తోడు ప్రమోషన్స్ పరంగా సాయితేజ్ మాత్రమే ఉంటాడు. మహా అయితే హీరోయిన్లు వస్తారేమో. బట్ ఈ మూవీలో హీరోయిన్లు కూడా ఉన్నారన్న విషయం ఈ డ్యూయొట్ వచ్చిన తర్వాత కానీ తేలలేదు.
కేతిక శర్మతో పాటు ప్రియా ప్రకాష్ వారియర్ కూడా ఉందట. బట్ తనకు సంబంధించి ఇప్పటి వరకూ ఒక్క పోస్టర్ లేదా ఇంకే అప్డేట్ లేదు. అంటే తను పవన్ కు పెయిర్ గా నటిస్తోందా లేక సినిమాలో ఏదైనా పాత్ర చేస్తుందా అనేది తెలియదు.
ఈ నెల 28న విడుదల కాబోతోన్న బ్రో చిత్రానికి సముద్రఖని దర్శకుడు. అతనే తమిళ్ లో రూపొందించిన వినోదాయ సీతమ్ కు ఇది రీమేక్. తెలుగుకు సంబంధించి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ను త్రివిక్రమ్ అందించాడు. త్రివిక్రమ్ అందించాడు అంటే పవన్ ను బాగా ఎలివేట్ చేస్తాడు కదా..? ఆ ఎలివేషన్స్ రిలీజ్ కు ముందే కాస్త ఆడియన్స్ కు టేస్ట్ చేస్తే అంచనాలు పెరుగుతాయి.
బట్ ఈ విషయంలో మేకర్స్ అంత ఆసక్తిగా కనిపించడం లేదా అనిపిస్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ తాజా పొలిటికల్ స్పీచ్ లు ఈ సినిమాను ఆంధ్రలో ఇబ్బంది పెడతాయి అనే అంటున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఘాటైన విమర్శలు చేస్తున్నాడు పవన్. ఇంత ఘాటు విమర్శలు లేనప్పుడే అతని సినిమాలను ఇబ్బంది పెట్టారు. మరి ఇప్పుడు ఊరుకుంటారా.. అనే సందేహాలు కూడా ఉన్నాయి.
మొత్తంగా చూస్తే ఇటు బిజినెస్ పరంగా నైజాంలో 32 కోట్లకు అమ్మేశారు. మైత్రీ వాళ్లు తీసుకున్నారు. అది తప్ప మరో హైలెట్ విషయం ఈ మూవీ బిజినెస్ కు సంబంధించి కనిపించడం లేదు అంటున్నారు. అంటే ఈ బ్రో ను ఎవరూ పట్టించుకోవడం లేదా.. లేక కావాలనే మేకర్స్ లో ప్రొఫైల్ మెయిన్టేన్ చేస్తున్నారా అనేది తెలియడం లేదు కానీ.. లో ప్రొఫైల్ అంటే ఖచ్చితంగా కొన్నవాళ్లకు సమస్యలు తప్పవు అనే చెప్పాలి.