బజ్ లేని సినిమా సాంగ్ ఎఫెక్ట్

అసలే బజ్ లేని సినిమా అన్నప్పుడు ఆడియన్స్ ను ఆకట్టుకునేందుకు ఏదైనా మంచి ఐటమ్ తో రావాలి. ఐటమ్ అంటే సాంగ్ మాత్రమే కాదు. ఓయాక్షన్ సీక్వెన్సో.. లేక సినిమాలోని ఇంకేదైనా ఆర్టిస్ట్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ నో రిలీజ్ చేయాలి. బట్.. ఎప్పటి నుంచో ఓ రేంజ్ లో సాగుతూ.. సాగదీతకు మీనింగ్ లా మారిన ఏజెంట్ సినిమా విషయంలో ఇదే రాంగ్ స్టెప్ వేశారు. అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ చిత్రం గత సమ్మర్ తర్వాత విడుదల కావాల్సింది.

బట్.. అప్పటి నుంచి రకరకాల రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తూ ఫైనల్ గా ఈ ఏప్రిల్ 28కి వచ్చారు. చూస్తోంటే ఈ డేట్ కు రావడం కూడా కష్టమే అనేలా ఉంది. అయినా వాళ్లు మాత్రం కాన్ఫిడెంట్ గా ఆ డేట్ కు వస్తున్నాం అని పోస్టర్స్ వదులుతున్నారు. కారణం ఇదీ అని ఖచ్చితంగా చెప్పలేం కానీ.. ఈ చిత్రంపై ఏ దశలోనూ అంచనాలు క్రియేట్ కాలేదు. ఫ్యాన్స్ మేటర్ పక్కన బెడితే.. జనరల్ ఆడియన్స్ అయినా.. ఇండస్ట్రీలోనూ, బిజినెస్ లోనూ ఏమంత బజ్ కనిపించడం లేదు. అలాంటి టైమ్ లో మరింత నీరసం వచ్చేలా ఓ కొత్త పాట విడుదల చేశారు. ఆ మాటకొస్తే.. అంతకు ముందు విడుదల చేసిన పాట కూడా ఎవరికీ గుర్తు లేదు. ఇప్పుడు మరో రొటీన్ సాంగ్ విడుదల చేసింది మూవీ టీమ్.


ఇదో బ్రేకప్ సాంగ్. ఏజెంట్ లాంటి టైటిల్ పెట్టి.. ఎయిట్ ప్యాక్ హీరోను చూపెట్టి.. ఇలా సింపుల్ గా బ్రేకప్ సాంగ్ తో రావడమే పెద్ద తప్పు. దానికి తోడు ఆ పాటకానీ, అందులోని స్టెప్పులు కానీ.. బ్రేకప్ అయిన కుర్రాడి యాటిట్యూడ్ కానీ.. ఏవీ కొంచెం కూడా ఆకట్టుకునేలా లేవంటే అతిశయోక్తి కాదు. అతి సాధారణమైన ట్యూన్, దానికి అవే పాత తరహా స్టెప్పులు.. మామూలుగా ఇలాంటి పాటలు యూత్ కు ఇమ్మీడియెట్ గా కనెక్ట్ అవుతాయి. కానీ ఈ పాట చూస్తే ఇప్పటి వరకూ సినిమాకు కనెక్ట్ అయి ఉన్నవాళ్లు కూడా డిస్కనెక్ట్ అయ్యేలా ఉన్నారు. ఏదేమైనా ప్రమోషన్స్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటే ఆడియన్స్ ను అంత ఆకట్టుకోవచ్చు. ప్లానింగ్ లేని ప్రమోషన్ మాత్రం ఫ్యాన్స్ ను కూడా ఇరిటేట్ చేస్తుంది అనేందుకు ఏజెంట్ పాటలు ఓ ఎగ్జాంపుల్ లా కనిపిస్తున్నాయీ మధ్య.

Related Posts