మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ ‘మట్కా’. వరుణ్ నటించిన గత రెండు చిత్రాలు ‘గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్’ ఘోరంగా విఫలమవ్వడంతో ఈ సినిమాపైనే అతను ఆశలు పెట్టుకున్నాడు. వైవిధ్యభరిత కథాంశాలతో సినిమాలు తీసే కరుణ కుమార్ దర్శకత్వంలో ‘మట్కా’ తెరకెక్కుతోంది. 1958-1982 మధ్య కాలంలో దేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన ఒక వాస్తవ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడట కరుణ కుమార్.
ఆద్యంతం పాత విశాఖపట్టణం నేపథ్యంలో గ్యాంబ్లింగ్, బెట్టింగ్ ఆట చుట్టూ సాగే గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ‘మట్కా’ రాబోతుంది. తాజాగా.. ఈ చిత్రం టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. ‘ఈ దేశంలో చలామణి అయ్యే ప్రతీ రూపాయిలో 90 పైసలు నూటికి ఒక్కడే సంపాదిస్తాడు.. మిగతా 10 పైసలు గురించి 99 మంది కొట్టుకుంటారు. నువ్వు ఆ 90 పైసలు సంపాదించే ఒక్కడివి.. 99 మందిలో ఒక్కడిగా ఉండిపోకు..’ అంటూ వరుణ్ తేజ్ కి హితబోధ చేసే డైలాగుతో ఈ టీజర్ మొదలైంది.
అక్కడనుంచి వరుణ్ తేజ్ విశాఖపట్టణంకు గ్యాంగ్ స్టర్ గా ఎలా ఎదిగాడు అనే క్రమాన్ని టీజర్ లో చూపించారు. ఈ టీజర్ లో వరుణ్ వివిధ గెటప్స్ ఆకట్టుకుంటున్నాయి. నవంబర్ 14న ‘మట్కా’ విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సినిమాలో వరుణ్ కి జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తుంది. ఇతర కీలక పాత్రల్లో నోరా ఫతేహి, నవీన్ చంద్ర, కిషోర్ కనిపించనున్నారు. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. వరుణ్ తేజ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని విజేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.