దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేసే అవకాశం కోసం హీరోలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. రాజమౌళి తీసేది ఎలాంటి కథ.. తమ పారితోషికం ఏంటి? వంటి విషయాలను హీరోలు అస్సలు పట్టించుకోరు. రాజమౌళి సినిమాలో నటించడం అనేది ఎంతో గర్వకారకమైన విషయంగా భావిస్తుంటారు.
ఇక.. ఒక సినిమాని డైరెక్ట్ చేశామా? వచ్చేశామా అన్నట్టు కాకుండా.. అహర్నిశలు ఆ సినిమా గురించే ఆలోచించి.. ఆ చిత్రాన్ని ఆడియన్స్ కు దగ్గరచేయడం వరకూ అన్ని బాధ్యతలు తానే తీసుకుంటాడు రాజమౌళి. నిర్మాత ఎవరైనా.. తన సినిమాకి సంబంధించి అంతిమ నిర్ణయం మాత్రం రాజమౌళిదే. జక్కన్న పై ఉన్న నమ్మకంతో నిర్మాతలు కూడా సినిమాపై సర్వ నిర్ణయాలు ఆయన పైనే వదిలేస్తుంటారు.
ప్రస్తుతం రాజమౌళి.. మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ఫినిషింగ్ స్టేజ్ కు చేరుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పుడు మహేష్ తో జక్కన్న చేసే చిత్రం రెండు భాగాలు అనే ప్రచారం జోరందుకుంది.
‘ఆర్.ఆర్.ఆర్’తో గ్లోబల్ లెవెల్ లో తన బ్రాండ్ ను చాటిచెప్పిన రాజమౌళి.. మహేష్ మూవీని ఇంటర్నేషనల్ లెవెల్ లో తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నాడు. దీంతో.. ఈ మూవీ బడ్జెట్ కూడా వెయ్యి కోట్లు దాటే అవకాశాలున్నాయట. ఈనేపథ్యంలోనే.. ఈ సినిమాని రెండు భాగాలుగా తీసుకురావాలని డిసైడయ్యాడట. రెండు భాగాలకు సరిపోయే కథ కూడా సెట్టవ్వడంతో.. మహేష్ కూడా రాజమౌళి నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.
మరోవైపు.. ‘బాహుబలి’ కోసం ప్రభాస్ ఏకంగా ఐదేళ్ల సమయాన్ని కేటాయించాడు. ఇప్పుడు మహేష్ కూడా జక్కన్న సినిమాకోసం అలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందేమో అనే ఆందోళన ఫ్యాన్స్‌లో ఉంది.