విశాల్ మార్క్ ఆంటోనీకి కోర్ట్ షాక్

విశాల్ హీరోగా నటించిన సినిమా మార్క్ ఆంటోనీ. ఆధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈ నెల 15న విడుదల కానుంది. అదే రోజు విడుదల కావాల్సిన తెలుగు స్కంద, తమిళ్ చంద్రముఖి2 చిత్రాలు ఈ నెల 28కి తమ చిత్రాలు వాయిదావేసుకున్నాయి. దీంతో తనకు సోలో రిలీజ్ దొరికిందని సంబర పడుతున్న విశాల్ కు చెన్నై కోర్ట్ షాక్ ఇచ్చింది. 15న విడుదల కావాల్సిన ఈ చిత్రానికి రిలీజ్ కాకుండా స్టే ఇచ్చింది కోర్ట్. అందుకు కారణం లైకా ప్రొడక్షన్స్ సంస్థ.


కరోనా టైమ్ లో లైకా సంస్థతో సినిమా చేస్తానని విశాల్ 21.29 కోట్లు అప్పు తీసుకున్నాడట. కానీ సినిమా చేయలేదు. డబ్బులూ తిరిగి ఇవ్వలేదు. దీంతో 2022లోనే లైకా ప్రొడక్షన్స్ సంస్థ మద్రాస్ హై కోర్ట్ లో కేస్ వేసింది. అప్పుడు కోర్ట్ విశాల్ ఆ సంస్థకు 15 కోట్లు డిపాజిట్ చేయాలని.. ఆర్డర్ ఇచ్చింది. అప్పటి వరకూ అతను నటించిన సినిమాలను ఏ ఫార్మాట్ లోనూ విడుదల చేయకూడదు అని కూడా చెప్పింది. కానీ విశాల్ కోర్ట్ తీర్పును ఉల్లంఘించాడట. తమకు డబ్బులు ఇవ్వకుండానే సినిమాలు విడుదల చేసుకుంటున్నాడని మరోసారి కోర్ట్ కు వెళ్లింది లైకా. దీన్ని కోర్ట్ సీరియస్ గా భావించింది. ఇది కోర్ట్ ధిక్కరణ కిందికే వస్తుందని చెప్పింది. అందుకే ఈ నెల 12న విశాల్ ను వ్యక్తిగతంగా కోర్ట్ కు హాజరు కావాలని ఆదేశాలిచ్చింది.


ఈ వ్యవహారం ఇలా ఉండగానే మార్క్ ఆంటోనీ నిర్మాత మాత్రం చాలా ధీమాగా ఉన్నాడు. తన సినిమా చెప్పిన టైమ్ కే విడుదలవుతుందంటున్నారు. కొంతమంది కావాలనే తన సినిమాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటున్నాడు. మరి అదే నిజమైతే ఈ అప్పు సంగతి ఏమైనట్టు..? అనే ప్రశ్నకు ఆయన వద్ద సమాధానం లేదు. మొత్తంగా మార్క్ ఆంటోనీ విడుదలపై ప్రస్తుతం సస్పెన్స్ నెలకొంది.

Related Posts