వెండితెర రారాజు.. మెగా మహారాజుచిరంజీవి పుట్టిన రోజు స్పెషల్

స్వయంకృషికి చిరునామా అతడు. ఎన్నో ఛాలెజింగ్ రోల్స్ పోషించి బాక్సాఫీస్ తో పాటు అభిమానుల్నీ గెలుచుకున్న విజేత. అందుకే నీ ప్రాణం ఖరీదు ఎంత అంటే అభిమానుల గుండె చప్పట్లంత అని చెబుతాడు. ప్రతిభ శిఖరమంతైనా.. ప్రయత్నలోపం పిసరంత కూడా చూపని నిరంతర కృషీవలుడు. దశాబ్ధాలుగా బాక్సాఫీస్ ను రూల్ చేస్తోన్న ఈ వెండితెర ఇంద్రుడిని ఆదర్శంగా తీసుకుని.. ఇండస్ట్రీకి వచ్చిన వాళ్లెంతమంది..? తెలుగు సినిమా కమర్షియల్ స్టాండర్డ్స్ ను ఎల్లలు దాటించిన వెండితెర రారాజు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయన కెరీర్ గురించి ఒకసారి తెలుసుకుందాం..

మెగాస్టార్ చిరంజీవి .. ఎన్ని మైలు రాళ్లు దాటితే.. ఎన్ని అవమానాలు సహిస్తే.. ఎన్ని ఛాలెంజ్ లను స్వీకరిస్తే.. ఎన్ని రివార్డులు పొందితే.. ఎన్ని రికార్డులు నెలకొల్పితే వచ్చిందీ పేరు. ప్యాషన్ కు స్వయంకృషిని జోడించి, పట్టుదలతో ప్రయత్నిస్తే ఒక మనిషి ఎన్ని శిఖరాలైనా అధిరోహించవచ్చు అన్న మాటకు కూడా అక్షర రూపం ఆ పేరు.. నలభైయేళ్ల క్రితం.. నలుగురు.. ఐదుగురులో ఒకడిగా మొదలై.. టాలీవుడ్ కే నెంబర్ వన్ గా మారి..వేలమందికి ఆదర్శమై కోట్లమంది అభిమానుల్ని సంపాదించుకునే వరకూ చిరంజీవి ప్రస్థానం అనన్యసామాన్యమైనది..


టీనేజ్ లో ఎవరైనా జీవితం గురించి కలలు కంటారు. కానీ చిరంజీవి తనలోని కళ గురించి కలలు కన్నాడు. ఆ కళను పదిమందికీ చూపించాలనే కలలు కన్నాడు. ఆ కలను కేవలం తాపత్రయంగానే మిగుల్చుకోకుండా తపనగా మలచుకున్నాడు. దానికి సాధించాలనే కసిని రంగరించి.. వెండితెర కాన్వాస్ పై ఓ తెల్లకాగితంగా మారేంత వరకూ ఎన్నో చేశాడు. అవన్నీ ఎవరికీ తెలియవు.. ఇంకా చెప్పాలంటే అతనికి తప్ప ఇంకెవరికీ తెలియవు. చిరంజీవి అనగానే వెంటనే గుర్తొచ్చేది డ్యాన్స్.. సినిమాల్లోకి రావాలనుకున్న టైమ్ లో.. అప్పటికే వచ్చిన ఎన్నో సినిమాల్లోని డ్యాన్స్ లను తనదైన శైలిలో ప్రదర్శిస్తూ.. స్నేహితుల్నీ సన్నిహితుల్నీ సమ్మోహన పరచిన ఆ చిరంజీవి.. తర్వాత ఇండియన్ సినిమా హిస్టరీలో డ్యాన్స్ ను ఓ అధ్యాయంగా నిలుపుతాడనీ.. దానికి అతనే తొలి హీరోగా నిలుస్తాడని అప్పుడెవరూ ఊహించి ఉండరు కదా.


చిరంజీవి ఎస్సెట్ ఆయన కళ్లు. ఆ కళ్లలో కనిపించే ఫైర్. అందుకే.. ఈ కుర్రాడి కళ్లు భలే ఉన్నాయే అనుకునే వేశాలిచ్చిన వాళ్లూ ఉన్నారు. ఏదైనా సాధించాలనుకునేవాడి కళ్లలో ఇలాంటి ఫైర్ ఉంటేనే అతను సాధిస్తాడు. అటుపై మెరుపులా కదిలే అతని బాడీ. ఏ ఎక్స్ ప్రెషన్ నైనా పలికించే అభినయం.. మొత్తంగా నేను అనుకున్నది సాధించగలను అన్న అంతులేని ఆత్మవిశ్వాసమే అతన్ని గెలిపించింది.. ఆ గెలుపు సాధ్యమైన తర్వాత .. అతను ఎన్ని గెలుచుకున్నాడో మనకూ తెలుసు కదా..


చిరంజీవి ప్రస్థానం.. చినుకులా మొదలైంది.. చివరికి అది ఓ మహానదిగా మారింది. ఇప్పుడా మహానదిని అనుసంధానించుకుంటూ ఎన్ని కాలువలు ప్రవహిస్తున్నాయో తెలుస్తోంది కదా. అందుకు కారణం.. అతను చినుకులా మొదలైనప్పుడు ఎంత స్థితప్రజ్ఞతతో ఉన్నాడో.. నదిలా మారినప్పుడూ అదే స్థితప్రజ్ఞతను చూపిస్తున్నాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎదిగిన కొద్దీ ఒదుగుతూ కెరీర్ ను నిర్మించుకున్న మగమహారాజు చిరంజీవి. మెరికలా కదులుతూ.. ఒక్కో సినిమాకు వందమందిని ఆకర్షిస్తూ.. ఆఫర్స్ వచ్చేలా చేసుకున్నాడు. కష్టేఫలీ అన్నట్టుగా అతని చురుకుదనానికి అతి తక్కువ టైమ్ లోనే సోలో హీరోగా అవకాశాలు వచ్చాయి. కానీ అప్పటికే ఇండస్ట్రీలో ఎంతో మంది సీనియర్ హీరోలున్నారు. అందరూ శిఖరాల్లాంటి వారే. మరి కొండలమధ్య తనో గుట్టలా నిలవకుండా ఒక్కో హిట్టూ పేర్చుకుంటూ ఆ శిఖరాల దరిలోనే తనో శిఖరంగా ఎదిగే ప్రయత్నం చేశాడు..


అదృష్ణమే కలిసి వచ్చిందో.. కష్టానికి ఫలితంగా వచ్చిందో.. కానీ ఎంతో మంది మహానటులు, సూపర్ స్టార్లున్న పరిశ్రమలో అతనికి తనదైన రికగ్నిషన్ ఇచ్చిన సినిమా ఖైదీ. ఇది లేకపోతే అనే ప్రశ్నే అక్కర్లేదు అన్నట్టుగా ఆ సినిమాలో అతని నటన కనిపిస్తుంది. ఆశయం, ఆవేదన, ఆక్రోశం, నిస్సహాయత చివరికి తిరుగుబాటు.. ఇలా ఎన్నో వైరుధ్యాలను అద్భుతమైన అభినయంతో చూపించాడీ సినిమాలో. అందుకే చిరంజీవికి ఖైదీ అదృష్టం అని చెప్పలేం. ఖచ్చితంగా అది అతని ప్రతిభకు దక్కిన అవకాశం.అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు కాబట్టే సుప్రీమ్ హీరోగా మారాడు.

తెలివి, బలం ఉన్నవాడికి కాస్త అండ కూడా ఉంటే.. ఇక అతని ఎదుగుదలను ఎవరూ ఆపలేరు. చిరంజీవి వినమ్రత నచ్చి అల్లు రామలింగయ్య అల్లుడిగా చేసుకున్నారు. అప్పటికి ఆయన ఇండస్ట్రీలోని అతి ముఖ్యుల్లో ఒకరు. అయితే అండ దొరికింది కదా అని చిరంజీవి ఎప్పుడూ అహంకారాన్ని ప్రదర్శించలేదు. అంచెలంచెలుగా సుప్రీమ్ హీరో నుంచి మెగాస్టార్ గా ఎదుగుతూ వెళ్లాడు. ఒక దశలో చిరంజీవి డేట్స్ కావాలంటే, ఏడాదికి ఎన్ని సినిమాలు చేసినా.. అడ్వాన్స్ లు ఇచ్చిన వారికి కూడా మూడు నాలుగేళ్లు పట్టేంతగా అతని ఇమేజ్ పెరుగుతూ పోయింది.


చాలామంది అంటూ ఉంటారు.. దేనికైనా కాలం కలిసి రావాలని. కానీ వస్తోన్న కాలాన్ని కావాల్సినట్టుగా మలచుకోవడమే అసలైన విజయ రహస్యం. చిరంజీవి ఇదే చేశాడు. వచ్చిన ఇమేజ్ కీ, తన బాడీ లాంగ్వేజ్ కు సరిపడే కథల్ని మాత్రమే ఎంచుకుంటూ పోయాడు. అదే అతన్ని ఎన్టీఆర్ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీకి గ్యాంగ్ లీడర్ ను చేసింది.


మూడు దశాబ్ధాల క్రితం..చిరంజీవి అన్న పేరు బాక్సాఫీస్ కు మంత్రమైపోయింది. చిరంజీవి అన్న పేరు తర్వాత ఇంకెవరున్నా అనవసరం.. అన్నంతగా ఆ ఇమేజ్ పెరిగిపోయింది. ఆ ఇమేజ్ ను క్యాష్ చేసుకోగలిగినవాళ్లు చేసుకున్నారు.. అవకాశం వచ్చినా మిస్ చేసుకున్న వాళ్లూ ఉన్నారు. కానీ ఏం జరిగినా మెగాస్టార్ అనే కిరీటం మాత్రం ఎప్పుడూ తలదిగలేదు. అదే ఇతర హీరోల్నుంచి మెగా స్టార్ ను వేరు చేస్తుంది.
చిరంజీవి ఊరికే మాస్ హీరో అయిపోలేదు. మాస్ ఇమేజ్ ఎలివేట్ అవడానికి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నా.. అతను కథలను వదల్లేదు. ఆ సెలక్షన్ లో మిస్టేక్స్ లేకపోవడం వల్లే అతను టాలీవుడ్ నెంబర్ వన్ హీరో అయ్యాడు. అతను ఎంచుకున్న సినిమాల్లోని కథలే.. అతన్ని బిగ్గర్ దన్ బిగ్ బి అనే స్థాయి హీరోను చేశాయి.. ఈ విషయంలో మాస్ హీరోలు కావాలనుకునే కుర్ర హీరోలు చిరంజీవి పాత సినిమాలు చూస్తే.. అతను ఎందుకు మెగాస్టార్ అయ్యాడో అర్థమౌతుంది.


మరి అంత ఇమేజ్ ఉన్నా చిరంజీవికి ఫ్లాపుల్లేవా.. అంటే ఉన్నాయి.. ఇంకా చెప్పాలంటే ఎంతో ఇమేజ్ ఉన్న తనే డిప్రెషన్ లోకి వెళ్లిపోయే అన్ని ఫ్లాపులు వచ్చాయి. ఒక దశలో ఇక చిరంజీవి పని ఐపోయింది అన్నవాళ్లూ ఉన్నారు. అందుకు కారణం.. చేదు అయినా నిజం చెప్పాలంటే ఇమేజ్ వల్ల వచ్చిన ఓవర్ కాన్ఫిడెన్సే. కొంత గ్యాప్ తీసుకుని.. కేవలం ఆ ఓవర్ తీసేసి మళ్లీ తనదైన కాన్ఫిడెన్స్ తో మొదలుపెట్టాడు.. మళ్లీ హిట్లర్ రూలింగ్ మొదలైంది.


1990ల్లో చిరంజీవికి వరుస ఫ్లాపులు వచ్చాయి. ముందే చెప్పినట్టు డిప్రెషన్ లోకి వెళ్లాడు. అలాగని మళ్లీ రాకుండా ఉండలేదు కదా.. అయితే దాన్నో పీడకలగా భావించి సరికొత్త ఉత్సాహంతో బరిలోకి దిగాడు.. ప్రణాళికలూ మార్చుకున్నాడు. కానీ దశాబ్ధం తర్వాత ఆయనకు మరో పీడకల వచ్చింది. అదే పొలిటికల్ ఎంట్రీ. అది ఆయన్నీ, అభిమానుల్నీ ఎంత ఇబ్బంది పెట్టిందో అందరికీ తెలుసు. బట్.. ఇక దాన్నుంచి పూర్తిగా బయటపడ్డాడు. రీ ఎంట్రీ ఇచ్చి ఖైదీ నెంబర్ 150తో మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేశాడు.
తెలుగు సినిమా కమర్షియల్ స్టాండర్డ్స్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకువెళ్లిన స్టార్ చిరంజీవి. ఎన్టీఆర్ తర్వాత ఎవరు అనుకున్న పరిశ్రమకు నేనున్నాను అంటూ దూసుకువచ్చి.. అభిమానుల హృదయాల్లో శాశ్వతఖైదీలా మారిపోయాడు. సహనం, సందర్భశుద్ధి మెండుగా ఉన్న మెగాస్టార్ వంటి వ్యక్తి రాజకీయాల్లో రాణించలేకపోవడం ఒక రకంగా వెండితెర చేసుకున్న అదృష్టం కూడా.


ఇప్పుడైనా.. ఇక ముందైనా చిరంజీవిని జయాపజయాల కొలతల్లో చూడకూడదు.. లక్ష్యాన్ని చేరుకోవడానికి అతను పడ్డ శ్రమను చూడాలి. సద్విమర్శలను స్వీకరించి, కువిమర్శలను లైట్ తీసుకున్న ఆయన స్థితప్రజ్ఞత చూడాలి.వెండితెరకు రారాజే అయినా.. అభిమానులకు, అయిన వాళ్లకు అన్నయ్యనే పసితనపు నిజాయితీ చూడాలి. ఎంచుకున్న రంగంలో రాణించడానికి అతను చూపించిన వైవిధ్యం చూడాలి. రొటీన్ అన్న పదాన్ని బ్రేక్ చేస్తేనే క్రియేటివ్ ఫీల్డ్ లో ఉండగలరు. ఆ విషయాన్ని గుర్తించడానికి చిరంజీవిని చూడాలి. అలా చూసిన ఎందరికో ఆయన చేయందించాడు.. చేయూతనిచ్చాడు. ఆ చేయూత నిరంతరం కొనసాగాలని కోరుకుంటూ .. ఈ మెగా మహారాజు మరిన్ని సినిమాలతో మనల్ని ఎంటర్టైన్ చేస్తూ.. ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుటూ.. ఆయనకు హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతోంది తెలుగు 70ఎమ్ఎమ్. జై చిరంజీవా..

              - బాబురావు కామళ్ల.

Related Posts