అప్పట్లో ‘మల్లీశ్వరి‘ కోసం కోటి తీసుకున్న కత్రిన

విక్టరీ వెంకటేష్ హీరోగా విజయ్ భాస్కర్ దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన ‘మల్లీశ్వరి‘ మెమరబుల్ హిట్ సాధించింది. ఈ సినిమాలో టైటిల్ రోల్ మురిపించింది కత్రిన కైఫ్. అప్పటికి కేవలం బాలీవుడ్ లో ‘బూమ్‘ అనే సినిమాలో మాత్రమే మెరిసింది కత్రిన. అది కూడా ఫ్లాప్. కేవలం ఓ టాప్ మోడల్ అనే క్రేజ్ తో ‘మల్లీశ్వరి‘లో టైటిల్ రోల్ కి ఎంపిక చేశారు మేకర్స్.

అప్పట్లో ‘మల్లీశ్వరి‘ చిత్రానికి కత్రిన తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో హాట్ టాపిక్ అయ్యింది. ఏమాత్రం ఎక్స్ పీరియన్స్ లేని నటీమణికి అంత పెద్ద మొత్తం ఎలా ఇస్తున్నారనే గుసగుసలు ఇండస్ట్రీలో వినిపించాయి. లేటెస్ట్ గా ‘మల్లీశ్వరి‘ చిత్రానికి గానూ కత్రిన తీసుకున్న రెమ్యునరేషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు డైరెక్టర్ విజయ్ భాస్కర్.

ఒక యాడ్ లో కత్రినా కైఫ్ ని చూసిన డైరెక్టర్ విజయ్ భాస్కర్.. నిర్మాత సురేష్ బాబుని ఒప్పించి ఆమెను ‘మల్లీశ్వరి‘ చిత్రానికి తీసుకున్నారట. ఆమె ‘మల్లీశ్వరి‘ చిత్రానికి రూ.75 లక్షలు డిమాండ్ చేసిందట. దానికి తోడు ఆమె స్టాఫ్ ఖర్చులు, హోటల్ ఖర్చులు అంటూ మరో రూ.25 లక్షలు అయ్యిందట. అంటే.. అప్పట్లో మన తెలుగు హీరోయిన్స్ తీసుకునే దానికంటే డబుల్ రెమ్యునరేషన్. అయినా.. ‘మల్లీశ్వరి‘ టైటిల్ రోల్ కు ఆమె పర్ఫెక్ట్ గా సూటవుతోందని తీసుకున్నారట. తీరా చూస్తే ఆమెకు తెలుగు అస్సలు రాదు.. దాంతో ఎక్స్ ప్రెషన్స్ రావడం లేదట. అలాగే.. డ్యాన్సుల్లోనూ అప్పటికి ఆమెకు అనుభవం లేదు. అయినా.. ‘మల్లీశ్వరి‘ పాత్రకు ఆమెను అన్ని విధాలుగా సమాయత్తం చేసి.. చివరకు విజయాన్ని సాధించారు. ‘మల్లీశ్వరి‘ తర్వాత తెలుగులో బాలకృష్ణ ‘అల్లరి పిడుగు‘ సినిమాలోనూ నటించింది కత్రిన.

Related Posts