వారం వారం బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాల సందడి కొనసాగుతూనే ఉంది. ఈ వారం థియేటర్లలో సూర్య ‘కంగువా’, వరుణ్ తేజ్ ‘మట్కా’ చిత్రాలు సందడి చేయబోతున్నాయి. పాన్ వరల్డ్ మూవీగా రేపు పలు భాషల్లో ‘కంగువా’ విడుదలకు ముస్తాబవుతుంటే.. ఆద్యంతం వైజాగ్ నేపథ్యంలో పీరియాడికల్ స్టోరీగా వరుణ్ తేజ్ ‘మట్కా’ రాబోతుంది.
సూర్య నటించిన అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం ‘కంగువా’. ఈ సినిమాకోసం గతం, వర్తమానం అంటూ రెండు ప్రపంచాలను సృష్టించాడు డైరెక్టర్ శివ. రెండు, మూడు భాగాలుగా రాబోతున్న ‘కంగువా’ నుంచి ఫస్ట్ పార్ట్ రేపు విడుదలవుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి. ఈ సినిమాని త్రీడిలోనూ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో ‘కంగువా’ అదరగొడుతుంది.
‘కంగువా’ సినిమాలో సూర్యకి ధీటైన ప్రతినాయకుడిగా బాబీ డియోల్ కనిపించబోతున్నాడు. దిశా పటాని హీరోయిన్ గా నటించింది. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్నందించగా.. ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించాయి.
మరోవైపు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘మట్కా’పైనా మంచి అంచనాలున్నాయి. ఇప్పటివరకూ ట్రెండ్స్ లో ‘కంగువా’నే టాప్ లో నిలిచినా రేపు విడుదల తర్వాత కంటెంట్ పరంగా కనెక్ట్ అయితే ‘మట్కా’ మంచి విజయాన్ని సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
‘పలాస’ ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో పీరియాడిక్ డ్రామాగా ‘మట్కా’ రూపొందింది. 1958-1982 మధ్య కాలంలో దేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన ఒక వాస్తవ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిందట. గ్యాంబ్లింగ్, బెట్టింగ్ ఆట చుట్టూ ఈ సినిమా కథ ఉండబోతుంది. వైజాగ్ నేపథ్యంగా సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో వరుణ్ తేజ్ విభిన్న గెటప్స్ లో కనిపించబోతున్నాడు.
వరుణ్ తేజ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని విజేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో వరుణ్ కి జోడీగా మీనాక్షి చౌదరి నటించింది. ఇతర కీలక పాత్రల్లో నోరా ఫతేహి, నవీన్ చంద్ర, కిశోర్, రవీంద్ర విజయ్ వంటి వారు కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతాన్ని సమకూర్చాడు.