సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా కంగువ. ఈ సినిమాపై ఎప్పటి నుంచో భారీ అంచనాలున్నాయి. సూర్య ఫస్ట్ టైమ్ ఐదు గెటప్స్ లో కనిపిస్తుండటం.. ఇది అతని కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందుతుండటంతో పాటు ఫస్ట్ లుక్ నుంచే ఏదో కొత్తగా ఉండబోతోంది అనిపించుకుంది.
ఇప్పుడు వస్తోన్న ప్యాన్ ఇండియన్ సినిమాల ట్రెండ్ లో సౌత్ నుంచి మరో భారీ సినిమా కాబోతోంది అని కూడా అనిపించుకుంది.ఆడియన్స్ కూడా ఈ చిత్రాన్ని అలాగే చూస్తున్నారు. అందుకే అర్థరాత్రి గ్లింప్స్ అంటే చెన్నై మొత్తం ఈగర్ గా చూసింది. సూర్యకు తెలుగులోనూ తిరుగులేని ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే తెలుగువారు సైతం గ్లింప్స్ కోసం ఆసక్తిగా చూశారు. మొత్తంగా అర్థరాత్రి విడుదలైన ఈ గ్లింప్స్ విజువల్స్ పరంగా అద్భుతం అనిపించుకుంది.
గ్లింప్స్ ఆరంభంలోనే కంగువ ఎంతోమందిని సంహరించినట్టు.. అందులో ఒకడు మిగిలిపోతే అతను పెద్ద ఎత్తు నుంచి రగులుతున్న ఓ శూలాన్ని సంధిస్తే అది అతనికి గుండెల్లోకి దిగుతుంది. ఆ తర్వాత అడవి నుంచి పరుగెత్తుకు రావడం.. అతను కొండపై ఉంటే కింద నుంచి వేలాది మండుతున్న బాణాలు అతనిపైకి సంధించడం.. అలా వస్తోన్న ఓ బాణాన్ని అతను సడెన్ గా పట్టుకోవడం.. ఇవన్నీ మైండ్ బ్లోయింగ్ విజువల్స్ లా అనిపిస్తున్నాయి. బట్ ఇవన్నీ మనకు మరీ కొత్తైదే కాదు. హాలీవుడ్ లోనూ ఇప్పుడిప్పుడే ఇండియన్ సినిమాల్లోనూ చూస్తున్న విన్యాసాలే. కానీ కథా పరంగా వస్తున్నప్పుడు కొన్నిసార్లు కాపీ షాట్స్, విజువల్స్ కూడా అద్భుతం అనిపిస్తాయి. అలాంటి మ్యాజిక్ ను కంగువా చేయబోతున్నాడు అనిపిస్తోంది.
ఇక ఈ మొత్తం గ్లింప్స్ లో హైలెట్ అంటే దేవీ శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్. అతన్ని ఎందుకు నమ్మాడు శివ అంటే ఇదుగో ఇందుకు అన్నట్టుగా ప్రూవ్ చేసుకున్నాడు. మరి గ్లింప్స్ కే గూస్ బంప్స్ ఇచ్చే మ్యూజిక్ ఇచ్చాడంటే ఇక సినిమాలో ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఏదేమైనా ఈ గ్లింప్స్ పై అప్పుడే ఏదో కమెంట్ చేయడం మరీ తొందర అవుతుంది. అందుకే టీజర్ లేదా ట్రైలర్ వచ్చే వరకూ చూడాల్సిందే.
ఇక విక్రమ్ సినిమాలో రోలెక్స్ అనే చిన్న పాత్రతోనే చాలా పెద్ద ఇంపాక్ట్ వేశాడు సూర్య. ఫస్ట్ పూర్తిగా ప్యాన్ ఇండియన్ లుక్ తో ఉన్న సినిమాతో వస్తున్నాడు. ఇది ఖచ్చితంగా అతని టాలెంట్ కు తగ్గ రేంజ్ పెంచేలానే కనిపిస్తోంది. ఇక సూర్య సరసన దిశాపటానీ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని స్టూడియోగ్రీన్ సంస్థ నిర్మిస్తోంది. తెలుగులో యూవీ క్రియేషన్స్ వాళ్లు విడుదల చేయబోతున్నారు. వచ్చే యేడాది మార్చిలో రాబోతోన్న ఈ మూవీ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.