‘భారతీయుడు 3’ కోసం రంగంలోకి మూడో కమల్

విశ్వనటుడు కమల్ హాసన్ ను మరోసారి జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా నిలిపిన చిత్రం ‘భారతీయుడు’. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయంతో అలరించాడు కమల్. తండ్రి పాత్రలో సేనాపతిగా కరప్షన్ ను ఎదురించిన కమల్.. కొడుకు పాత్రలో లంచగొండిగా నటించాడు. ఇక.. ‘భారతీయుడు’లో సేనాపతి తన కన్న కొడుకునే చంపడం క్లైమాక్స్.

‘భారతీయుడు’ క్లైమాక్స్ నుంచే ఇప్పుడు ‘భారతీయుడు 2’ మొదలవుతోంది. ‘భారతీయుడు’ క్లైమాక్స్ లో ‘ఎక్కడ తప్పు జరిగినా ఖచ్చితంగా నేను వస్తాను. భారతీయుడుకి చావే లేదు’ అనే డైలాగ్ చెబుతాడు సేనాపతి. అన్నట్టుగానే మళ్లీ సమాజంలో పెరిగిపోయిన అవినీతి, లంచగొండితనంపై కదం తొక్కడానికి సేనాపతి తిరిగొస్తాడు. ‘భారతీయుడు 2’ అంతా సేనాపతి మీదే సాగినా.. ఈ మూవీ మరో సీక్వెల్ ‘భారతీయుడు 3’ కోసం సేనాపతి తండ్రి పాత్రను రంగంలోకి దింపుతున్నాడట శంకర్.

‘భారతీయుడు 3’ ఆద్యంతం సేనాపతి తండ్రి పాత్ర మీదే ఉంటుందట. అతను బ్రిటీష్ వాళ్లతో ఎలా పోరాడాడు అనే కథాంశాన్నే ‘భారతీయుడు 3’లో హైలైట్ చేయనున్నారట. ఇప్పటికే చాలా భాగం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ‘భారతీయుడు 3’ని వచ్చే సంక్రాంతి బరిలో తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

Related Posts