ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాల లైనప్ ఎంత క్రేజీగా ఉందో తెలిసిందే. సెప్టెంబర్ లో ‘దేవర’ను విడుదలకు ముస్తాబు చేస్తున్న తారక్.. వచ్చే యేడాది ‘వార్ 2’తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఈ రెండు సినిమాల షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు యంగ్ టైగర్. ఇక.. లేటెస్ట్ గా ప్రశాంత్ నీల్ తో తన మోస్ట్ అవైటింగ్ మూవీకి ముహూర్తాన్ని పూర్తి చేశాడు.
ఎన్టీఆర్-నీల్ వర్కింగ్ టైటిల్ తో ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ ను ఎంతో విభిన్నంగా డిజైన్ చేస్తున్నాడట డైరెక్టర్ ప్రశాంత్ నీల్. హీరోల ఎలివేషన్స్ ను ఆన్‌స్క్రీన్ పై అద్భుతంగా ప్రెజెంట్ చేయడంలో ప్రశాంత్ నీల్ దిట్ట. నటనకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ఎన్టీఆర్ వంటి నటుడు దొరికితే.. ఆ ఎలివేషన్స్ మరో లెవెల్ లో ఉంటాయి. అలాంటి గూస్‌బంప్స్ తీసుకొచ్చే సన్నివేశాలకు ఈ మూవీలో కొదవే ఉండదట.
ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ లాంచింగ్ రోజే మూవీ రిలీజ్ డేట్ ప్రకటించి సర్‌ప్రైజ్ చేశారు మేకర్స్. జనవరి 9, 2026లో ఈ సినిమాను వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. రిలీజ్ డేట్ పోస్టర్ చూస్తే సింపుల్‌గానే ఉంది. కానీ.. కాస్త పట్టి చూస్తే అసలు విషయం తెలుస్తోంది. డార్క్ థీమ్‌లో ఈ పోస్టర్ బ్యాగ్రౌండ్ చూస్తే వరల్డ్ మ్యాప్ కనిపిస్తుంది. దానిలో ఒకవైపు 1969 అని రాసుంది. దానికి కుడివైపు గోల్డెన్ ట్రయాంగిల్ అని ఉంది.
ఈనేపథ్యంలో సోషల్ మీడియాలో ఈ చిత్రం యొక్క కథాంశం విస్తృతంగా చర్చించబడుతోంది. 1969లో ఇండియా, చైనా మధ్య జరిగిన ఓపియం మాఫియాకు సంబంధించిన సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రం రూపొందుతుందని అంటున్నారు. పోస్టర్ లో గోల్డెన్ ట్రయాంగిల్, కలకత్తా పోర్ట్ వంటి పదాలు ఈ రూమర్స్ కి మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి.
ఎన్టీఆర్ ఈ చిత్రంలో డ్రగ్ లార్డ్ పాత్రలో కనిపించే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. చైనా-ఇండియా ఇతివృత్తం కావడంతోనే ఈ మూవీకి ‘డ్రాగన్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ సినిమాని మేజర్ పార్ట్ ఫారెన్ లోనే చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నాడట ప్రశాంత్ నీల్.