తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ హీరో సినిమాలకు కొత్త అధ్యాయాన్ని తెరిచింది ‘హను-మాన్’. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా నటించిన ఈ సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను అబ్బురపరిచాయి. ఈ ఏడాది సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలతో పాటు విడుదలైన ‘హను-మాన్’ ఘన విజయాన్ని సాధించింది. అంతేకాదు.. దశాబ్దాలుగా తెలుగు సీమలో విడుదలైన సంక్రాంతి చిత్రాలన్నింటిలోనూ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘హను-మాన్’ నిలిచింది. వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లు కొల్లగొట్టింది.
ఇప్పటికే పాన్ ఇండియా హిట్ గా నిలిచిన ‘హను-మాన్’ ఇప్పుడు పాన్ వరల్డ్ మార్కెట్ లోకి వెళుతోంది. ఈకోవలోనే జపాన్ దేశంలో విడుదలకు ముస్తాబవుతోంది. అక్టోబర్ 4న జపాన్ లో ‘హను-మాన్’ విడుదలవుతున్నట్టు ప్రకటించాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.
జపాన్ లో భారతీయ సినిమాలను బాగా ఆదరిస్తున్నారు. భారతీయ పురాణాల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్ర కథాంశం జపాన్ ప్రేక్షకులకు కొత్త అనుభవం అందిస్తుందని నమ్ముతుంది చిత్రబృందం.