మధ్యప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న మహత్తర అవకాశం!!

మధ్యప్రదేశ్ లో 50 శాతం షూటింగ్
చేసే చిత్రాలకు గరిష్టంగా 2 కోట్ల రాయితీ!

మధ్యప్రదేశ్ లో పర్యాటకాన్ని (టూరిజం) ప్రోత్సహించేందుకు మధ్యప్రదేశ్ టూరిజం బోర్డ్ (MPTB) తమ రాష్ట్రంలో కనీసం యాభై శాతం షూటింగ్ (ఇండోర్/ఔట్ డోర్) జరుపుకునే చిత్రాలకు గరిష్టంగా కోటిన్నర నుంచి రెండు కోట్లు వరకు నగదు ప్రోత్సాహకాలు ఇస్తోంది. అక్కడ ప్రభుత్వ లొకేషన్లకు చెల్లించే సొమ్ములో 75 శాతం సైతం వెనక్కి ఇస్తోంది. అంతేకాదు... ఆ రాష్ట్రం నలుమూలలా ఇబ్బందులు లేకుండా షూటింగ్ చేసుకునేందుకు అనుమతులు చాలా సులభంగా లభించేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ విషయాలు వెల్లడించేందుకు మధ్యప్రదేశ్ టూరిజం బోర్డ్ డిప్యూటీ డైరెక్టర్ "ఉమాకాంత్ చౌదరి" తన సిబ్బందితో సహా హైదరాబాద్ విచ్చేశారు. దళారులు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా... ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవచ్చని ఆయన ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ప్రతి విషయం అత్యంత పారదర్శకంగా ఉంటుందని ఆయన ధృవీకరించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... 

“షూటింగ్ పర్మిషన్స్ జారీ చేయడం మొదలుకుని… నిర్ణీత వ్యవధిలో రాయితీ అందించడం వరకు ప్రతి ఒక్కటి పారదర్శకంగా ఉంటుందని, మధ్యప్రదేశ్ లో… దేశంలో మరెక్కడా లేని అద్భుత సందర్శనీయ ప్రాంతాలను ప్రపంచానికి పరిచయం చేయడం… ఈ ప్రోత్సాహకాల ముఖ్య ఉద్దేశ్యమని” అన్నారు. ఇందుకోసం రూపొందించిన వెబ్ సైట్ ద్వారా అన్ని విషయాలు సమగ్రంగా తెలుసుకోవచ్చని ఉమాకాంత్ ప్రకటించారు. ఈ అవకాశం దక్షిణ భాషా చిత్రాలన్నింటికీ వర్తిస్తుందని వివరించారు. మధ్యప్రదేశ్ పర్యాటక సంస్థ కల్పిస్తున్న ఈ అరుదైన అవకాశాన్ని వినియోగించుకుని, “తప్పించుకోలేరు” చిత్రాన్ని తెరకెక్కించి… సౌత్ ఇండియాలోనే మొట్టమొదటిసారి నగదు ప్రోత్సాహకం అందుకున్న దర్శకనిర్మాత రుద్రాపట్ల వేణుగోపాల్ తన అనుభవాన్ని ఈ సందర్భంగా పంచుకున్నారు. నిర్మాతలు ఆచంట గోపీనాథ్, బెక్కెం వేణుగోపాల్, డి.ఎస్.రావు, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, యువ దర్శకులు చందా గోవింద్ రెడ్డి, గౌతమ్ రాచిరాజు, రైటర్ రవిప్రకాష్ తదితరులను రుద్రాపట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి)… మధ్యప్రదేశ్ టూరిజం బోర్డ్ డిప్యూటీ డైరెక్టర్ ఉమాకాంత్ చౌదరికి పరిచయం చేశారు. మధ్యప్రదేశ్ టూరిజం బోర్డ్ అందిస్తున్న ఈ అరుదైన అవకాశాన్ని వినియోగించుకోగోరువారు సహాయ సలహాల కొరకు తనను నేరుగా సంప్రదించవచ్చని, తన రెండో చిత్రం మధ్యప్రదేశ్ లోని పలు అద్భుత లోకేషన్స్ లో త్వరలోనే ప్రారంభం కానుందని వేణుగోపాల్ తెలిపారు!!

Related Posts