‘గణపథ్‘ గట్టి పోటీ ఇస్తాడా…?

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పేరు చెప్పగానే.. ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్.. స్ప్రింగులా మెలికలు తిరిగే డ్యాన్సులు గుర్తుకొస్తాయి. తెలుగు సినిమాల రీమేక్స్ తో బాలీవుడ్ లో స్టార్ గా మారిన టైగర్.. ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమపైనే ఫోకస్ పెట్టాడు. తన లేటెస్ట్ మూవీ ‘గణపథ్‘ను ఏకంగా ఐదు భాషల్లో విడుదలకు ముస్తాబు చేస్తున్నాడు. తాజాగా ‘గణపథ్‘ తెలుగు ట్రైలర్ విడుదలయ్యింది.

‘తప్పకుండా ఒక రోజు అమరుడైన యోధుడు జన్మిస్తాడు.. వాడు ధనవంతులకు పేదలకు మధ్యనున్న గోడను బద్దలుకొడతాడు.. ఆ యోధుడు చచ్చేవాడు కాదు.. చంపేవాడు..‘ అంటూ హీరో గురించి అదిరిపోయే ఇంట్రోతో ట్రైలర్ ప్రారంభమయ్యింది. ప్రెజెంట్ కి ఫ్యూచర్ కి అనుసంధానం చేసే టైమ్ ట్రావెల్ బ్యాక్ డ్రాప్ లో.. సైన్స్ ఫిక్షన్ స్టోరీతో వస్తోన్న ‘గణపథ్‘ ట్రైలర్ అయితే చాలా గ్రాండ్యుయర్ గా ఉంది. టైగర్ ష్రాఫ్ చేసిన డేరింగ్ స్టంట్స్.. డ్యాన్సెస్.. విజువల్ ట్రీట్ అందిస్తున్నాయి. హీరోయిన్ కృతి సనన్ కూడా యాక్షన్, డ్యాన్సెస్ లో ఇరగదీసినట్టు ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. ఇక.. బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ ఈ మూవీలో మరో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

బాలీవుడ్ లో ‘క్వీన్, సూపర్ 30‘ వంటి విజయాలందుకున్న వికాస్ బెహ్ల్ దర్శకత్వంలో ‘గణపథ్‘ చిత్రం రూపొందింది. ఈ సినిమాని పూజ ఫిల్మ్స్ – గుడ్ కో సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ‘గణపథ్‘ ట్రైలర్ ను చూస్తుంటే కథాంశం పరంగా.. విజువల్స్ పరంగా.. ప్రభాస్ ‘కల్కి 2898 ఎ.డి.‘ టీజర్ గుర్తుకొస్తుంది. మొత్తంమీద.. దసరా బరిలో అక్టోబర్ 20న ‘గణపథ్‘ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. ఇక.. అదే సమయంలో తెలుగు నుంచి ‘భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు‘.. తమిళం నుంచి అనువాద రూపంలో ‘లియో‘ సినిమాలు కూడా రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. దాంతో.. దసరా సీజన్ లో ఈ సినిమాలకు ‘గణపథ్‘ కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది.

Related Posts