95వ ఆస్కార్ అవార్డ్స్ వేడుకల్లో ఇండియన్ సినిమా.. లేదూ మనవరకూ గర్వంగా చెప్పుకోవాలంటే మన తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ వచ్చేసింది. చాలాకాలం తర్వాత ఇండియాను వరించిన ఆస్కార్ కావడంతో దేశమంతా సంబురాల్లో మునిగిపోయింది. ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ నుంచి ఊపిరి సలపని ప్రశంసలు వస్తున్నాయి.

దీంతో పాటు ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’అనే డాక్యుమెంటరీకి కూడా షార్ట్ ఫిల్మ్ విభాగంలో బెస్ట్ ఫిల్మ్ గా ఆస్కార్ అవార్డ్ వచ్చేసింది. ఇలా ఒకే యేడాది రెండు ఆస్కార్ లు రావడం మన దేశానికి రావడం ఇదే ప్రథమం అని చెప్పొచ్చు. అయితే ప్రపంచం అంతా చాలా గొప్పగా చెప్పుకునే ఆస్కార్ అవార్డ్స్ ఇప్పటి వరకూ మన ఇండియాకు ఎన్ని వచ్చాయి.. ఏ ఏ విభాగాల్లో వచ్చాయి అనేది చూస్తే.. నిజంగా ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం ఎంత స్ట్రాంగ్ గా ఉందో అర్థం అవుతుంది. ఎందుకంటే ఇదేమీ మనకు అందని ద్రాక్ష కాదు అని గతంలో అవార్డ్స్ సాధించిన వారిని చూస్తే అర్థమౌతుంది.


1983లో మన దేశానికి మొదటి ఆస్కార్ అవార్డ్ వచ్చింది. అటెన్ బరో తీసిన గాంధీ చిత్రానికి బెస్ట్ కాస్ట్యూమ్స్ విభాగంలో భాను అథైయా ఈ అకాడెమీ అవార్డ్ ను సాధించారు. ఆమెతో పాటు ఈ అవార్డ్ ను ఇంగ్లండ్ కు చెందిన జాన్ మోలో కూడా ఈ అవార్డ్ ను షేర్ చేసుకున్నారు. ఇక 1992లో తన ఎంటైర్ కెరీర్ లో ది బెస్ట్ మూవీస్ అందించినందుకు గానూ ది గ్రేట్ ఇండియన్ ఫిల్మ్ మేకర్ సత్యజిత్ రే కు ఆస్కార్ అకాడెమీ ప్రత్యేక అవార్డ్ ను అందించింది. ఆ టైమ్ లో ఆయన అనారోగ్యంతో ఉన్నారు. దీంతో అమెరికా వెళ్లలేకపోయారు. ఈ అవార్డ్ కు సంబంధించిన స్పీచ్ ను ఆయన హాస్పిటల్ బెడ్ పైనుంచే అందించారు. అదే యేడాది ఏప్రిల్ 23 సత్యజిత్ రే కన్నుమూశారు.


అయితే 2009లో మాత్రం ఆస్కార్ వేదికలన్నీ ఇండియన్ సినిమా పేరుతో మార్మోగిపోయాయి. స్లమ్ డాగ్ మిలియనీర్ అనే చిత్రానికి బెస్ట్ మ్యూజిక్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో జయ్ హో సాంగ్ కు ఏఆర్ రెహ్మాన్ తో పాటు గీత రచయిత గుల్జార్ కూ, ఇదే పాటకు సౌండ్ మిక్సింగ్ విభాగంలో రసూల్ పూకుట్టి ఆస్కార్ అవార్డ్స్ ను అందుకున్నారు. అయితే స్లమ్ డాగ్ మిలియనీర్ అనేది పూర్తిగ ఇంగ్లీష్ వాళ్లు తీసిన సినిమా కావడంతో అప్పట్లో రావాల్సినంత ప్రచారం రాలేదు. కానీ ఈ పాటతో ప్రపంచ వ్యాప్తంగా రెహ్మాన్ కు విశేషమైన గుర్తింపు వచ్చేసింది.


ఇక ఇప్పుడు మన తెలుగు సినిమా అయిన ఆర్ఆర్ఆర్ తో పాటు ది ఎలిఫెంట్ విస్పరర్స్ అనే డాక్యుమెంటరీస్ అకాడెమీ అవార్డుల్లో సత్తా చాటాయి. చూస్తోంటే రాబోయే రోజుల్లో ఇండియన్ సినిమాకు మరిన్ని ఆస్కార్ లు వచ్చే అవకాశాలు చాలానే ఉన్నాయనిపిస్తోంది. ఏదేమైనా మొన్నటి ఆస్కార్ అంటే మనకు అందని ద్రాక్ష అనుకున్నారు. బట్ ఇప్పుడు అదీ అందుతోంది. కాకపోతే ఇతర విభాగాల్లో కూడా మనం ప్రపంచ సినిమాకు మరింత గట్టి పోటీ ఇవ్వాల్సి ఉంది. ఆ రోజు కూడా త్వరలోనే వస్తుందని ఆశిద్దాం.