వెర్సటైల్ యాక్టర్ అనే పదానికి అసలు సిసలు నిర్వచనంలా ఉంటాడు కోలీవుడ్ స్టార్ ధనుష్. పేరుకు తమిళ యాక్టర్ అయినా.. హిందీ, తెలుగు భాషల్లోనూ స్ట్రెయిట్ మూవీస్ లో నటించి హిట్స్ కొట్టిన ఈ కాలం యాక్టర్. జాతీయ స్థాయిలో రెండు సార్లు ఉత్తమ నటుడిగా అవార్డులు అందుకున్న క్రెడిట్ కూడా ధనుష్ కే సొంతం.

విడాకుల తర్వాత ధనుష్ సినిమాల స్పీడు మరింత పెరిగింది. పట్టిందల్లా బంగారంలా వరుస హిట్స్ తో మంచి జోష్ మీదున్నాడు. డిసెంబర్ లో ‘కెప్టెన్ మిల్లర్‘ మూవీతో వస్తున్నాడు. పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా ఈ సినిమా రాబోతుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలతో ‘కెప్టెన్ మిల్లర్‘పై బజ్ భారీగానే ఏర్పడింది. పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నారు. ధనుష్ తో పాటు సందీప్ కిషన్, శివరాజ్ కుమార్ కూడా కీ రోల్స్ పోషించారు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్.

‘సాని కాయిదం‘ ఫేమ్ అరుణ్ మాథేశ్వరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటివరకూ ఒక భాగంగానే ప్రచారంలో ఉన్న ఈ సినిమాని రెండు భాగాలుగా తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఫస్ట్ పార్ట్ ను డిసెంబర్ 15న విడుదల చేస్తే.. ఆ తర్వాత సెకండ్ పార్ట్ ను వచ్చే యేడాది తీసుకురానున్నారట. ఈమధ్య సౌత్ లో రెండు భాగాలుగా రూపొందే సినిమాల సంఖ్య పెరుగుతోంది. అయితే.. ఫస్ట్ పార్ట్ హిట్ అయితేనే.. రెండో పార్ట్ కి మోక్షం కలుగుతుంది. మరి.. ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్‘ ఏ రీతిన అలరిస్తుందో చూడాలి.