HomeMoviesటాలీవుడ్తరాలు మారినా తరగని స్టార్‌డమ్..!

తరాలు మారినా తరగని స్టార్‌డమ్..!

-

దశాబ్దాలుగా చెక్కు చెదరని స్టార్ డమ్ ఆ కథానాయకుల సొంతం. ఇరవై కాదు, ముఫ్ఫై కాదు.. అంతకుమించి సంవత్సరాల నుంచి చిత్ర పరిశ్రమలో సత్తా చాటుతున్నారు. కొంతమంది చైల్డ్ ఆర్టిస్టులుగానే రంగ ప్రవేశం చేసి.. ఇప్పటికీ స్టార్స్ గా దుమ్మురేపుతుంటే.. మరికొంతమంది చిన్నా, చితకా పాత్రలతో ప్రవేశించి.. అగ్ర తారలుగా చక్రం తిప్పుతున్నారు. మరి.. ఇండియాలోని లాంగెస్ట్ కెరీర్ తో ఇప్పటికీ హీరోలుగా కొనసాగుతున్న ఆ స్టార్స్ ఎవరో చూసేద్దాం.

విశ్వనటుడు కమల్ హాసన్ కెరీర్ స్పాన్ ను పరిశీలిస్తే ఆశ్చర్యం కలగకమానదు. 1960లో ‘కలత్తూర్‌ కన్నమ్మ’ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చాడు కమల్. తొలుత కొంతభాగం తాతినేని ప్రకాశరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాని ఎ.భీమ్ సింగ్ పూర్తిచేశారు. జెమినీ గణేషన్, సావిత్రి ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రంలో కీలకమైన చైల్డ్ ఆర్టిస్ట్ రోల్ ను కమల్ పోషించాడు. అప్పటికి కమల్ వయసు ఆరేళ్లు. ఈ చిత్రంలోని పెర్ఫామెన్స్ కి కమల్ కి ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ దక్కింది. అలా.. 1960లో ప్రారంభించిన యాక్టింక్ కెరీర్ ను.. ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నాడు కమల్ హాసన్. తమిళనాట ఇప్పటికీ అగ్ర తారగా దూసుకుపోతున్నాడు ఈ విశ్వనటుడు.

1969లో వచ్చిన ‘సాత్‌ హిందుస్తానీ’ సినిమాలో తొలిసారి వెండితెరపై కనిపించే అవకాశం దక్కింది అమితాబ్ కి. ఈ సినిమా ఆర్ధికంగా విజయం సాధించకపోయినా.. అమితాబ్‌ కి నటుడిగా మంచి గుర్తింపు ను తీసుకొచ్చింది. ఆ తర్వాత ఇంతింతై వటుడింతై అన్నట్టుగా బాలీవుడ్ సూపర్ స్టార్ గా ఎదిగాడు బచ్చన్. ఈ ఏడాది నవంబర్ 7తో అమితాబ్ చిత్రపరిశ్రమకొచ్చి 55 ఏళ్లు పూర్తవ్వనున్నాయి. అప్పట్నుంచీ.. ఇప్పటివరకూ నటుడుగా మంచి ఫామ్ లో దూసుకుపోతున్నాడు అమితాబ్. ఇప్పటికీ అడపాదడపా ప్రధాన పాత్రలలో అలరిస్తూనే ఉన్నాడు. అందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంఫుల్ ‘కల్కి’ చిత్రం.

కమల్ హాసన్ తర్వాత సౌతిండియన్ స్టార్స్ లో లాంగెస్ట్ కెరీర్ ఉన్న కథానాయకుడు మమ్ముట్టి. 1971, ఆగస్టు 6న మమ్ముట్టి తొలి చిత్రం ‘అనుభవాంగల్ పలిచకల్’ విడుదలైంది. అంటే.. ఈ ఏడాది ఆగస్టుతో మమ్ముట్టి సినీ కెరీర్ కు 53 ఏళ్లన్నమాట. ఇప్పటికే మమ్ముట్టి మలయాళంలో హీరోగా అగ్ర పథాన దూసుకెళ్తూనే ఉన్నాడు.

నందమూరి నటసింహం బాలకృష్ణ సినీ కెరీర్ కు ఈ ఏడాది ఆగస్టు 30తో 50 ఏళ్లు పూర్తవుతాయి. నటరత్న నందమూరి తారకరామారావు స్వీయ దర్శకత్వంలో రూపొందిన ‘తాతమ్మ కల’ సినిమాతో 1974లో బాల నటుడిగా పరిచయం అయ్యాడు బాలయ్య. ఇక.. ఆ తర్వాత పదేళ్లకు ‘సాహసమే జీవితం’ నుంచి సోలో హీరోగా దుమ్మురేపుతున్నాడు. ఈ 50 ఏళ్ల ప్రస్థానంలో 108 సినిమాలలో నటించాడు. ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటికీ తెలుగులో అగ్ర కథానాయకుడిగా దూసుకెళ్తున్నాడు నటసింహం.

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు.. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఒకే ఏడాది సిల్వర్ స్క్రీన్ పై మెరిశారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన మోహన్ బాబు.. 1975లో విడుదలైన ‘స్వర్గం నరకం’ చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన ‘స్వర్గం నరకం’ మంచి విజయాన్ని సాధించింది. ఇక.. ఈ ఏడాది నవంబర్ 22తో మోహన్ బాబు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి 49 ఏళ్లు పూర్తవుతాయి.

మోహన్ బాబు తరహాలోనే సినీ ఇండస్ట్రీలో 49 ఏళ్ల లాంగ్ కెరీర్ ను పూర్తిచేసుకున్నాడు సూపర్ స్టార్ రజనీకాంత్. కె.బాలచందర్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘అపూర్వ రాగంగల్’తో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చాడు రజనీ. ఆ తర్వాతి సంవత్సరం రజనీకాంత్ నటించిన తొలి తెలుగు చిత్రం ‘అంతులేని కథ’ విడుదలైంది.

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్ కి.. ఈ సెప్టెంబర్ 22 తో 46 ఏళ్లు పూర్తవుతాయి. 1978 సెప్టెంబర్ 22న చిరంజీవి తొలి చిత్రం ‘ప్రాణంఖరీదు’ విడుదలైంది. తొలుత సహాయ, ప్రతినాయక పాత్రలలో మెరిసిన మెగాస్టార్.. ఆ తర్వాత నుంచి హీరోగా ఫిక్సయ్యాడు. ఏడాదికి ఏడెనిమిది సినిమాలలో నటిస్తూ.. కేవలం 10 ఏళ్ల సమయంలోనే వంద చిత్రాల మైలురాయిని అందుకున్నాడు. ఇప్పటివరకూ 155 చిత్రాలను విడుదల చేసి.. 46 ఏళ్లుగా కథానాయకుడిగానే కొనసాగుతున్నాడు మెగాస్టార్ చిరంజీవి.

తెలుగు చిత్ర సీమకు నాలుగు స్థంభాలుగా చెప్పుకునే వెటరన్ స్టార్స్ లో చిరంజీవి, బాలకృష్ణతో పాటు.. నాగార్జున, వెంకటేష్ కూడా ఉన్నారు. 1986వ సంవత్సరంలోనే నాగార్జున ‘విక్రమ్’ సినిమాతోనూ.. వెంకటేష్ ‘కలియుగ పాండవులు’ చిత్రంతోనూ హీరోలుగా పరిచయమయ్యారు.

నాగార్జున తొలి చిత్రం ‘విక్రమ్’ విడుదలైన ఈ ఏడాది మే 23 కి 38 ఏళ్లవ్వగా.. వెంకటేష్ ‘కలియుగ పాండవులు’ రిలీజై ఈ ఏడాది ఆగస్టు 14కి.. అంటే ఈరోజుకి 38 ఏళ్లయ్యింది. ఇక.. అప్పట్నుంచీ దాదాపు నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్ లో హీరోలుగా దుమ్మురేపుతూనే ఉన్నారు నాగార్జున-వెంకటేష్.

ఇవీ చదవండి

English News