సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమైన క్రేజీ మూవీస్

టాలీవుడ్ స్టార్ హీరోస్ అంతా ఇప్పుడు ఒకటికి మించిన సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒక చిత్రాన్ని సెట్స్ పై ఉంచి.. మరో రెండు, మూడు సినిమాలను లైన్లో పెడుతున్నారు. ఈ లిస్టులో ముందున్నవారు ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్.

లేటెస్ట్ గా ‘కల్కి’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన ప్రభాస్.. మరోవైపు ‘రాజా సాబ్’ను రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘రాజా సాబ్’ కొత్త షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ‘రాజా సాబ్’ సంక్రాంతి బరిలో విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాతో పాటు సెప్టెంబర్ నుంచి హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందే సినిమాని పట్టాలెక్కించనున్నాడట ప్రభాస్.

రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ప్రభాస్-హను రాఘవపూడి సినిమా ఉంటుందనే ప్రచారం జరిగింది. అయితే.. బ్యాక్ డ్రాప్ అదే సమయం అయినా.. ఈ పీరియడ్ మూవీ నేపథ్యం అంతా హైదరాబాద్ సంస్థానం చుట్టూ సాగుతుందని తెలుస్తోంది. ప్రీ-ఇండిపెండెన్స్ బ్యాక్ డ్రాప్ లో రజాకార్ల చరిత్రతోనే ప్రభాస్ సినిమాని తెరకెక్కించబోతున్నాడట డైరెక్టర్ హను రాఘవపూడి. ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. విశాల్ చంద్రశేఖర్ అప్పుడే కొన్ని పాటలు కూడా రెడీ చేశాడట. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఈ చిత్రం త్వరలో ముహూర్తాన్ని జరుపుకోనుంది.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ విషయానికొస్తే.. ప్రస్తుతం ‘దేవర, వార్ 2’ సినిమాలను సైమల్టేనియస్ గా పూర్తిచేస్తున్నాడు. ఇక.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందే సినిమాని ఆగస్టు నుంచే పట్టాలెక్కిస్తామని ప్రకటించారు. ఈ సినిమా ఆగస్టులో మొదలవ్వకపోయినా.. సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లడం పక్కా అని ప్రచారం జరుగుతుంది. ఇప్పటివరకూ ఎన్టీఆర్ నటించనటువంటి ఓ విలక్షణమైన పాత్రను ప్రశాంత్ నీల్ మూవీలో చేయబోతున్నాడట. ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా ‘ఎన్టీఆర్-నీల్’ ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్నాయి.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రెజెంట్ ‘గేమ్ ఛేంజర్’ను ఫినిష్ చేసే పనిలో ఉన్నాడట. ఈ సినిమాకోసం చరణ్ ఇంకా కేవలం పది, పదిహేను రోజులు పనిచేస్తే సరిపోతుందట. ‘గేమ్ ఛేంజర్’ ఫినిషింగ్ స్టేజ్ కు రావడంతో ఇప్పుడు బుచ్చిబాబుతో చేయబోయే తన 16వ సినిమా గురించి కసరత్తులు ప్రారంభించాడు చెర్రీ. ఈ సినిమాకోసం ఆస్ట్రేలియా వెళ్లి ప్రత్యేకంగా తన బాడీని మేకోవర్ చేయాలనుకుంటున్నాడట. సెప్టెంబర్ నుంచే చరణ్-బుచ్చిబాబు మూవీ పట్టాలెక్కనున్నట్టు తెలుస్తోంది. మొత్తంమీద.. ప్రభాస్-హను రాఘవపూడి, ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్, చరణ్-బుచ్చిబాబు ఈ మూడు క్రేజీ మూవీస్ ను నిర్మిస్తుంది మైత్రీ మూవీ మేకర్స్ కావడం విశేషం.

Related Posts