HomeMoviesటాలీవుడ్సంక్రాంతి బరిలో మరోసారి చిరంజీవి-బాలకృష్ణ

సంక్రాంతి బరిలో మరోసారి చిరంజీవి-బాలకృష్ణ

-

సంక్రాంతి సీజన్లలో కోడిపుంజుల్లా పోటీపడ్డ హీరోలంటే ముందుగా గుర్తొచ్చేది చిరంజీవి – బాలకృష్ణ. దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి స్టార్ వార్ కొనసాగిస్తున్న ఈ సీనియర్ హీరోలు.. బాక్సాఫీస్ వద్ద పలుమార్లు పోటీలో ఉన్నా.. సంక్రాంతి సీజన్ లో అయితే ఇప్పటివరకూ తొమ్మిది సార్లు తలపడ్డారు. వచ్చే సంక్రాంతి బరిలో పదోసారి చిరు-బాలయ్య మధ్య లెజెండరీ క్లాష్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయట.

నాలుగున్నర దశాబ్దాలకు పైగా చిత్రసీమలో కొనసాగుతోన్న చిరంజీవి, బాలకృష్ణ.. మిగతా సీజన్లలో పోటీ పడటం ఒకెత్తయితే.. సంక్రాంతి బరిలో పోటీ పడటం మరో ఎత్తు. తొలిసారి చిరు-బాలయ్య మధ్య సంక్రాంతి వార్ 1985లో జరిగింది. ఆ తర్వాత 1987, 1988, 1997, 2000, 2001, 2004 సంవత్సరాలలో వీరిద్దరి మధ్య సంక్రాంతి క్లాషెస్ జరిగాయి. ఇక.. బాలయ్య-చిరు మధ్య సంక్రాంతి క్లాష్ అనగానే గుర్తొచ్చేది 2017లో జరిగిన బాక్సాఫీస్ పోరు.

2017లో చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నంబర్ 150’.. బాలకృష్ణ 100వ సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సంక్రాంతి బరిలో పోటీ పడ్డాయి. ఒక్కరోజు గ్యాప్ లో వచ్చిన ఈ రెండు సినిమాలూ ఘన విజయాలు సాధించాయి.

గత ఏడాది సంక్రాంతి బరిలో తొమ్మిదో సారి పోటీ పడ్డారు. బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’, చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ ఒక్కరోజు గ్యాప్ లో వచ్చి బ్లాక్ బస్టర్స్ సాధించాయి. మళ్లీ ఇప్పుడు సంక్రాంతి బరిలో పదోసారి పోటీ పడడానికి సిద్ధమవుతున్నారట ఈ లెజెండరీ యాక్టర్స్.

ఇప్పటికే చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ సంక్రాంతి కానుకగా విడుదల తేదీ ఖరారు చేసుకుంది. వచ్చే జనవరి 10న చిరంజీవి ‘విశ్వంభర’ విడుదలకు ముస్తాబవుతోంది. మరోవైపు.. బాలకృష్ణ 109వ సినిమా కూడా సంక్రాంతినే టార్గెట్ చేసిందనే ప్రచారం జరుగుతుంది. బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తుంది. త్వరలోనే.. ఈ సినిమా విడుదల తేదీపై క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్.

రాబోయే సంక్రాంతికి తెలుగు నుంచి చిరంజీవి, బాలకృష్ణలతో పాటు.. వెంకటేష్-అనిల్ రావిపూడి, రవితేజ 75 వంటి చిత్రాలు కూడా రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. మరోవైపు తమిళం నుంచి అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’, సూర్య-కార్తీక్ సుబ్బరాజ్ సినిమాలు కూడా పొంగల్ పోరుకు సిద్ధమవుతున్నాయి.

ఇవీ చదవండి

English News