చిన్న వయసులోనే జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా నిలిచిన కేరళ కుట్టి కీర్తి సురేష్. మాతృ భాష మలయాళంతో పాటు.. తెలుగు, తమిళంలలో హీరోయిన్ గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది కీర్తి. ఈరోజు (అక్టోబర్ 17) కీర్తి సురేష్ పుట్టినరోజు.
తొలుత మలయాళంలో కథానాయికగా పరిచయమైన కీర్తి.. 2016లో రామ్ సరసన ‘నేను శైలజ’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నానితో ‘నేను లోకల్’, పవన్ కళ్యాణ్ తో ‘అఙ్ఞాతవాసి’ వంటి చిత్రాలు చేసింది. సావిత్రి బయోపిక్ ‘మహానటి’ చిత్రం.. కీర్తి కెరీర్ కు మంచి టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. ఈ చిత్రంతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డును సైతం అందుకుంది.
‘మహానటి’ తర్వాత పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ వైపు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది కీర్తి. అలా లేడీ ఓరియెంటెడ్ గా ‘పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి, సాని కాయిదం’ వంటి చిత్రాలు చేసింది. వీటిలో మూడు చిత్రాలు డైరెక్ట్ ఓటీటీలో రిలీజవ్వగా.. ‘గుడ్ లక్ సఖి‘ మాత్రం థియేట్రికల్ రిలీజయ్యింది. అయితే.. ఈ చిత్రాలలో కీర్తి నటనకు ప్రశంసలు దక్కినా.. ‘సాని కాయిదం‘ ఒక్కటే కీర్తి సురేష్ కి విజయాన్నందించింది.
ఒకవైపు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూనే.. మరొకవైపు అగ్ర కథానాయకులతో కమర్షియల్ మూవీస్ లోనూ అలరించింది కీర్తి. నితిన్ తో చేసిన ‘రంగ్ దే‘ ఫర్వాలేదనిపించగా.. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన కీర్తి నటించిన ‘సర్కారు వారి పాట‘ వసూళ్ల వర్షం కురిపించింది. ఇక.. గతేడాది విడుదలైన నాని ‘దసరా‘ అయితే కమర్షియల్ గానూ వర్కవుట్ అయ్యింది. అవార్డుల పరంగానూ అదరగొట్టింది. పోయినేడాదే చిరంజీవి చెల్లెలుగా నటించిన ‘భోళాశంకర్‘ తీవ్రంగా నిరాశపరిచింది.
ఈ ఏడాది తెలుగులో హీరోయిన్ గా సినిమాలేవీ చేయలేదు కీర్తి. అయితే.. ప్రభాస్ ‘కల్కి‘ మూవీలో బుజ్జి కారుకి వాయిస్ అందించింది. తెలుగులోనే కాదు.. అన్ని భాషల్లోనూ బుజ్జి వెహికల్ కి కీర్తినే వాయిస్ ఇవ్వడం విశేషం. ప్రస్తుతం తమిళం, హిందీలలో బిజీగా కొనసాగుతుంది. ఈ ఏడాది డిసెంబర్ లో కీర్తి డెబ్యూ బాలీవుడ్ మూవీ ‘బేబి జాన్‘ విడుదలకు ముస్తాబవుతుంది. తమిళ చిత్రం ‘తేరి’ రీమేక్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో కీర్తి సురేష్ గ్లామరస్ అవతార్ లో కనువిందు చేయబోతుంది.