ప్రభాస్ సినిమా అంటేనే వందల కోట్లతో ముడిపడిన వ్యవహారం. ‘బాహుబలి’ సిరీస్ తర్వాత ‘సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్’ ఆశించిన విజయాలు అందుకోలేదు. దీంతో.. ప్రభాస్ పనైపోయిందనుకున్నారంతా. ఆ సమయంలో వచ్చింది ‘సలార్’. గతేడాది చివర్లో విడుదలైన ‘సలార్’తో మళ్లీ గ్రేట్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమాతో ప్రభాస్ లోని రెబలిజమ్ ను బయటకు తీసిన క్రెడిట్ ప్రశాంత్ నీల్ సొంతం చేసుకున్నాడు. ‘సలార్’ తర్వాత ‘కల్కి’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.
ప్రస్తుతం ప్రభాస్ నుంచి ఇమ్మీడియెట్ గా రాబోయే చిత్రం ‘రాజా సాబ్’. అసలు ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో ‘రాజా సాబ్’పై కాస్త తక్కువ బజ్ ఉండేది. అందుకు ప్రధాన కారణం ఈ సినిమా ఆద్యంతం కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతుందని.. తక్కువ బడ్జెట్ లోనే ఈ మూవీ తెరకెక్కుతుందనే ఊహాగానాలు వినిపించడం. ఎప్పుడైతే ‘రాజా సాబ్’ నుంచి గ్లింప్స్ వచ్చిందో.. అప్పట్నుంచీ ఈ మూవీపై బజ్ పెరిగింది.
‘రాజా సాబ్’లో ప్రభాస్ లుక్ కి మంచి రెస్పాన్స్ దక్కింది. రొమాంటిక్ హారర్ కామెడీగా మారుతి తెరకెక్కిస్తున్న ఈ సినిమా బడ్జెట్ కూడా భారీగా ఉంటుందట. విజువల్ ఎఫెక్ట్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉండనుందట. అందుకే.. ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ కి క్రేజీ ఆఫర్స్ వస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే యేడాది ఏప్రిల్ లో ‘రాజా సాబ్’ రిలీజ్ కు రెడీ అవుతుంది.
‘రాజా సాబ్’ పూర్తి కాకుండానే హను రాఘవపూడి డైరెక్షన్ లో ‘ఫౌజి’ని పట్టాలెక్కించేశాడు. ఈ సినిమా ప్రభాస్ లేకుండానే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. రెండో షెడ్యూల్ కూడా షూటింగ్ జరుపుకుంటున్నట్టు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, టి-సిరీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.1940 నేపథ్యంలో హిస్టారికల్ టచ్ తో సాగే పీరియాడికల్ మూవీ ‘ఫౌజీ’. ఈ సినిమాలో సోల్జర్ గా కనిపించబోతున్నాడు ప్రభాస్. అతనికి జోడీగా ఇమాన్వి ఇస్మాయిల్ నటిస్తుంది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్నందిస్తుండగా.. సుదీప్ ఛటర్జీ సినిమాటోగ్రఫీ సమకూరుస్తున్నాడు.
ప్రభాస్ నటించబోయే మరో క్రేజీ మూవీ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో రూపొందే ‘స్పిరిట్’. ఫస్ట్ టైమ్ ప్రభాస్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించబోయే సినిమా ఇది. సందీప్ రెడ్డి వంగా మార్క్ మేకింగ్ తో ఈ సినిమాని సమ్‌థింగ్ స్పెషల్ గా తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఈ సినిమాలో పోలీసాఫీసర్ పాత్రలో ప్రభాస్ మేకోవర్ నెవర్ బిఫోర్ అన్నట్టు ఉండబోతుందని డైరెక్టర్ సందీప్ ఇప్పటికే పలుమార్లు చెప్పాడు. ఈ ఏడాది చివరి నుంచి ‘స్పిరిట్’ సెట్స్ పైకి వెళ్లనుంది.
‘రాజా సాబ్, ఫౌజి, స్పిరిట్’ సినిమాలతో పాటు.. ది మోస్ట్ అవైటింగ్ ‘సలార్ 2’.. ఆ తర్వాత ‘కల్కి 2’ కూడా ప్రభాస్ కిట్టీలో ఉన్నాయి. ఇంకా.. విష్ణు మంచు నటిస్తున్న ‘కన్నప్ప’లోనూ కేమియోలో మురిపించనున్నాడు డార్లింగ్. మొత్తంమీద.. ప్రస్తుతం అరడజను సినిమాలతో ప్రభాస్ ఇండియాలోనే బిజీయెస్ట్ స్టార్ గా ఉన్నాడు. మిగతా వాళ్లెవరూ అతని దరిదాపుల్లో కూడా లేరు.