ఈసారి స్టైలిష్ గా వస్తోన్న సేనాపతి

వెండితెరపై సందేశాత్మక చిత్రాలను అత్యధ్భుతంగా తీర్చిదిద్దడంలో దిట్ట శంకర్. తాను చెప్పాలనుకున్న మెస్సేజ్ ను కమర్షియల్ గా భారీ కాన్వాస్ పై ప్రెజెంట్ చేయడం అతని స్టైల్. అందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంఫుల్ ‘భారతీయుడు’. విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా శంకర్ తెరకెక్కించిన ‘భారతీయుడు’ సంచలన విజయం సాధించింది. ఆ చిత్రానికి సీక్వెల్ గా వస్తోంది ‘భారతీయుడు 2’. జూలై 12న విడుదలకు ముస్తాబైన ‘భారతీయుడు 2’ నుంచి ఇప్పటికే రెండు పాటలు, గ్లింప్స్ రిలీజయ్యాయి. తాజాగా.. ట్రైలర్ విడుదలైంది.

‘చదువుకి తగ్గ జాబ్ లేదు.. జాబ్ కి తగ్గ జీతం లేదు.. కట్టిన టాక్స్ కి తగ్గట్టు ఫెసిలిటీస్ దొరకడం లేదు..’ అంటూ ప్రస్తుతం సొసైటీలో ప్రజలు ఎదుర్కొంటున్న బాధలను పరిచయం చేస్తూ మొదలైంది ఈ ట్రైలర్. ఇక.. ‘దొంగిలించేవాడు దొంగిలిస్తూనే ఉంటాడు.. తప్పు చేసే వాడు తప్పు చేస్తూనే ఉంటాడు.. సిస్టమ్ ను సరి చేయడానికి కొంచెం కూడా ప్రయత్నం చేయడం లేదు.. అందరినీ చీల్చి చెండాడే హంటింగ్ డాగ్ రావాలి’ అంటూ సిద్ధార్థ్ చెప్పే డైలాగ్స్ తో ‘భారతీయుడు’గా కమల్ హాసన్ ఎంట్రీ అదిరింది.

సేనాపతి పాత్రలో కమల్ హాసన్ విభిన్న గెటప్స్ లో అదరగొట్టాడు. ‘ఇది రెండో స్వతంత్ర్య పోరాటం.. గాంధీజీ మార్గంలో మీరు.. నేతాజీ మార్గంలో నేను’ అంటూ కమల్ చెప్పే డైలాగ్స్ ట్రైలర్ లో ఆకట్టుకుంటున్నాయి. ఇక.. ట్రైలర్ ఎండింగ్ లో యాక్షన్ సీన్స్ లో చెలరేగిపోయాడు విశ్వనటుడు. విలన్లతో సేనాపతి చెప్పే ‘పారిపోలేరు.. దాక్కోనూలేరు.. టామ్ అండ్ జెర్రీ ఆట ఆరంభమైంది..’ అని చెప్పే డైలాగ్ తో ట్రైలర్ కి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.

మొత్తంమీద.. శంకర్ తరహా భారీ తనంతో ‘భారతీయుడు 2’ ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ట్రైలర్ లో కమల్ హాసన్, సిద్ధార్థ్, రకుల్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా క్యారెక్టర్స్ హైలైట్ గా కనిపించాయి. ఇక.. ట్రైలర్ లో ఆకట్టుకుంటున్న మరో క్యారెక్టర్ గురించి చెప్పాల్సి వస్తే అది విలన్ ఎస్.జె.సూర్య. ఈ సినిమాలో ఎస్.జె. సూర్య క్యారెక్టర్ ను ఎంతో రిచ్ గా, స్టైలిష్ గా డిజైన్ చేశాడు శంకర్. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాని అనిరుధ్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

Related Posts