మాచో స్టార్ గా టాలీవుడ్ లో తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్నాడు గోపీచంద్.అయితే ఇది గతం. ఇప్పుడు అతని సుడి తిరగడం లేదు. చాలాకాలంగా ఒక్క హిట్ కోసం చకోర పక్షిలా చూస్తున్నాడు. వరుసగా సినిమాలైతే చేస్తున్నాడు కానీ.. హిట్ మాత్రం రావడం లేదు. చివరగా వచ్చి పక్కా కమర్షియల్ బిగ్గెస్ట్ డిజాస్టర్. ఇక ఇప్పుడు తనకు రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన శ్రీవాస్ డైరెక్షన్ లో ‘రామబాణం’లా వస్తున్నాడు. డింపుల్ హయాతి హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో జగపతిబాబు, ఖుష్బూ మరో జంటగా నటించారు. మే 12న విడుదల కాబోతోన్న రామబాణం ట్రైలర్ విడుదల చేశారు.

ఈ ట్రైలర్ చూస్తే గోపీచంద్ ఏం మారలేదు అనేది స్పష్టంగా కనిపిస్తోంది. అదే మాస్ మసాలా ఎంటర్టైన్మెంట్స్ ఫార్ములాలో ఉందీ ట్రైలర్. ఒక పాట ఒక ఫైట్. ఒక సెంటిమెంట్ సీన్ ఒక కామెడీ సీన్. ఓ ఐటమ్ సాంగ్.. మరో మాస్ సాంగ్.. ఇది తప్ప కొత్తగా ఏం కనిపించడం లేదీ ట్రైలర్ చూస్తే. మామూలుగా గోపీచంద్ ఇమేజ్ అదే. బట్ ఇప్పుడు స్టార్ల ఇమేజ్ ల కంటే కొత్తగా ఉందా లేదా అనే ఎంక్వైరీలే ఎక్కువగా చేస్తున్నారు ఆడియన్స్. ఇలాంటి టైమ్ లో మళ్లీ పాత చింతకాయపచ్చడిలాంటి కంటెంట్ వస్తే ఫ్యాన్స్ కూడా ఇబ్బంది పడతారు అని గోపీకి ఎవరూ చెప్పడం లేదో ఏమో కానీ.. కేవలం తనకు హిట్స్ ఇచ్చాడు కాబట్టి బ్లైండ్ గా డైరెక్టర్ ను నమ్మేసినట్టున్నాడు. పైగా ఈ దర్శకుడి చివరి సినిమా సాక్ష్యం కూడా పోయింది.
నిజానికి సమ్మర్ లో మంచి టైమ్ లో రిలీజ్ అవుతోంది రామబాణం. బట్ టైటిల్ లో ఉన్న ఫోర్స్ సినిమా ట్రైలర్ లో కనిపించడం లేదు. ఏదేమైనా ఈ తరహా కంటెంట్ కు కాలం చెల్లుతోంది ఇప్పుడు. అలాగని పూర్తిగా పోయింది అని చెప్పలేం. ఒక్కోసారి కొందరు హీరోలకు ఎగ్జెంప్షన్ ఉంటుంది. రీసెంట్ గా మెగాస్టార్ కు వాల్తేర్ వీరయ్య, బాలయ్యకు వీరసింహారెడ్డి లాగా ఈ సారి గోపీచంద్ కు కూడా టైమ్ కలిసొస్తే.. రామబాణం బాక్సాఫీస్ ఫీట్ లో హిట్ టాస్క్ ను ఛేదిస్తుంది. లేదంటే గోపీ ఖాతాలో మరో ఫ్లాప్ పడుతుంది. అంతే.