రసవత్తరంగా మారుతోన్న సంక్రాంతి సీజన్

ప్రభాస్ ‘సలార్‘ ఎఫెక్ట్ తో సినిమాల జంబ్లింగ్ కొనసాగుతూనే ఉంది. తొలుత సెప్టెంబర్ 28న రిలీజవ్వాల్సిన ‘సలార్‘ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తికాకపోవడంతో డిసెంబర్ 22కి షిప్టయ్యింది. దాంతో క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ నెలలో రావాల్సిన సినిమాలు ఒక్కొక్కటిగా కొత్త విడుదల తేదీలు ఖారారు చేసుకుంటున్నాయి.

తాజాగా విక్టరీ వెంకటేష్ 75వ సినిమా ‘సైంధవ్‘ క్రిస్టమస్ సీజన్ నుంచి సంక్రాంతికి షిప్టయ్యింది. సంక్రాంతి బరిలో జనవరి 13న ‘సైంధవ్‘ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై శైలేష్ కొలను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రద్ధా శ్రీనాథ్‌, రుహాని శర్మ, ఆండ్రియా, బేబీ సారా ఇతర కీలక పాత్రలు పోషిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ ప్రతి నాయకుడిగా కనిపించబోతున్నాడు.

ఇప్పటికే సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సినిమాల జాతర మామూలుగా లేదు. అసలు సంక్రాంతిని టార్గెట్ చేస్తూ తొలుత విడుదల తేదీ ఖరారు చేసుకున్న తొలి చిత్రాలలో ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ ఒకటి. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ఫ్యూచరిస్టిక్ స్టోరీతో రూపొందుతోన్న ‘కల్కి‘ సంక్రాంతికి రావడం కష్టమేననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకు ప్రధాన కారణం ఈ సినిమా షూటింగ్ ఇంకా చాలాభాగం పూర్తవ్వాల్సి ఉండడమే. పైగా పాన్ వరల్డ్ రేంజులో రూపొందుతోన్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు కూడా భారీ సమయమే వెచ్చించాల్సి ఉంటుంది.

ఇక సంక్రాంతి బరిలో పక్కాగా వస్తోంది అనుకుంటోన్న భారీ చిత్రాలలో ‘గుంటూరు కారం‘ ఒకటి. నిన్నటివరకూ మహేష్ మూవీ సంక్రాంతికి వస్తోందా? లేదా? అనుమానాలు ఉండేవి. కానీ.. లేటెస్ట్ గా ‘గుంటూరు కారం‘ సంక్రాంతికి రావడం పక్కా అంటూ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘గుంటూరు కారం‘ రిలీజ్ కు కేవలం 100 రోజులు మాత్రమే ఉందంటూ మరోసారి రిలీజ్ డేట్ ను మరోసారి గుర్తు చేశారు.

గతంలో సంక్రాంతి కానుకగా ‘సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు‘ చిత్రాలతో భారీ విజయాలందుకున్న కింగ్ నాగార్జున వచ్చే సంక్రాంతికి ‘నా సామిరంగ‘ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. నాగ్ 99వ చిత్రంగా రూపొందుతోన్న ‘నా సామి రంగ‘ సినిమాపైనా మంచి అంచనాలున్నాయి. విజయ్ బిన్ని డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీకి ఆస్కార్ విజేత కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

సంక్రాంతి బరిలో విడుదలకు ముస్తాబైన మూవీస్ లో మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న ‘ఈగల్‘ కూడా ఒకటి. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా విడుదల తేదిని ఇంకా ఖరారు చేయలేదు. కానీ, ఈగల్ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందులో రవితేజకు జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది.

ఇంకా సంక్రాంతినే టార్గెట్ చేస్తూ రాబోతున్న చిత్రాలలో విజయ్ దేవరకొండ, పరశురామ్ మూవీ ఒకటి. ‘గీత గోవిందం‘ వంటి సూపర్ హిట్ తర్వాత రాబోతున్న విజయ్, పరశురామ్ మూవీపై మంచి అంచనాలున్నాయి. ఈ సినిమాలో విజయ్ కి జోడీగా మృణాల్ ఠాకూర్ నటిస్తోంది.

యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, తేజా సజ్జా కాంబినేషన్‍లో వస్తున్న ‘హనుమాన్‘ కూడా సంక్రాంతినే టార్గెట్ చేసింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలతో ‘హనుమాన్‘ కూడా ఆడియన్స్ అటెన్షన్ పొందింది.

Related Posts