డా II ఎల్ వి గంగాధర శాస్త్రి కి భారత దేశపు ప్రతిష్ఠాత్మక ‘కేంద్ర సంగీత నాటక అకాడమీ’ అవార్డు

‘భగవద్గీత’ అంటే భారతదేశపు ఆలోచనా విధానమని, ఇది మతాలకు అతీతమైన, సర్వజనామోదయోగ్యమైన, ఆచరణీయమైన, అత్యుత్తమమైన కర్తవ్య బోధ అనీ, దీనిని ప్రతి ఒక్కరూ చదివి, అర్ధం చేసుకుని, ఆచరించడం ద్వారా స్వార్ధరహిత ఉత్తమ సమాజాన్ని ఏర్పరచవచ్చని, అందుకే తమ ‘భగవద్గీతా ఫౌండేషన్’ ద్వారా గీతా ప్రచారం కోసమే తన జీవితాన్ని అంకితం చేశానని గంగాధర శాస్త్రి అన్నారు.
ప్రతీ సమస్యకు పరిష్కారం చూపే మహా గ్రంథం.. సాక్షాత్తూ శ్రీకృష్ణ పరమాత్ముల వారే స్వయంగా ఉపదేశించిన సారాంశం భగవద్గీత. భగవద్గీత అనగానే ఘంటసాల గానామృతం ఆలపించిన 700 శ్లోకాల సారం శ్రోతల మదిని పులకరింపజేసేది. ఇప్పుడు అదే ఘనతను సాధించారు శ్రీ ఎల్‌.వి గంగాధర శాస్త్రి గారు.భారత దేశపు ఆధ్యాత్మిక సారమైన భగవద్గీత లోని 700 శ్లోకాలలో ఘంటసాల స్వరపరచి పాడిన 108 శ్లోకాలను ఆయన గౌరవార్థం యథాతథం గా పాడడం తో పాటు, మిగిలిన 594 శ్లోకాలను స్వీయ సంగీతం లో, తెలుగు తాత్పర్య సహితం గా గానం చేసి, అత్యున్నత సాంకేతిక విలువలతో రికార్డు చేసి, ‘భారతీయ గాయకుడి తొలి సంగీత భరిత సంపూర్ణ భగవద్గీత’ గా శ్రీ శ్రీ శ్రీ విశ్వేశ తీర్థ స్వామి, డాII ఏ పి జె అబ్దుల్ కలాం చేతులమీదుగా విడుదల చేసి, అంతటి తో తన బాధ్యత తీరిపోయిందని భావించకుండా, స్వార్ధ రహిత ఉత్తమ సమాజ నిర్మాణం కోసం గీతా ప్రచారానికే తన జీవితాన్ని అంకితం చేసినందుకు గంగాధర శాస్త్రి కి ఈ అవార్డు దక్కింది.


ఇంతటి ఘనత సాధించినందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కళారత్న పురస్కారంతో సత్కరించింది. మధ్యప్రదేశ్ లోని ‘మహర్షి పాణిని యూనివర్సిటీ’ ‘గౌరవ డాక్టరేట్’ తోను సత్కరించింది. గత 16 సంవత్సరాలుగా గీత పట్ల గల తన అంకిత భావాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర సాంస్కృతిక , పర్యాటక శాఖామంత్రి శ్రీ జి. కిషన్‌ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసారు శ్రీ ఎల్‌.వి గంగాధర శాస్త్రి.
తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ కు గంగాధర శాస్త్రి కృతజ్ఞతలు తెలియజేసారు. ఇది తనకు తొలి జాతీయ అవార్డు అన్నారు. ఈ అవార్డు – పాట నేర్పిన తన తల్లి తండ్రులకు, ‘గీతా గాన మార్గదర్శి’ ఘంటసాల కు, గీతా సద్గురువులకు, శాస్త్రీయ సంగీతం నేర్పిన గురువులకు అంకితమన్నారు.

Related Posts