ఈ ఫ్లాప్ కాంబినేషన్ భళా అనిపించుకుంటుందా..?

ఫస్ట్ మూవీకే టాలెంటెడ్ అనిపించుకుని నెక్ట్స్ మూవీకే తలనొప్పి తెప్పించే దర్శకులు చాలామందే ఉంటారు. అలాగని వారిని తక్కువగా అంచనా వేయలేం. కాస్త జాగ్రత్తగా కథలు రాసుకుంటే మళ్లీ భళా అనిపించే కెపాసిటీ ఉంటుంది. అలా అనిపించేందుకే వస్తున్నాడు దర్శకుడు చైతన్య దంతులూరి. అతని డైరెక్షన్ లో శ్రీ విష్ణు హీరోగా వస్తోన్న చిత్రమే భళా తందనాన. ప్రస్తుతం ఇద్దరూ ఫ్లాపుల్లోనే ఉన్నారు. మరి ఈ మూవీతో ఇద్దరూ ఒకేసారి భళా అనిపించుకుంటారా లేక.. పాత కథే రిపీట్ అవుతుందా..?
చైతన్య దంతులూరి బాణం చిత్రంతో దర్శకుడుగా పరిచయం అయ్యాడు. ఈ మూవీతోనే హీరోగా నారా రోహిత్ ఎంట్రీ ఇచ్చాడు. ఓ సంక్లిష్టమైన కథను ఎంచుకుని.. సహజమైన కథనంతో ఆకట్టుకుంది బాణం. సినిమా బ్లాక్ బస్టర్ కాకపోయినా.. విమర్శకులను మెప్పించింది. చైతన్య దర్శకుడుగా బాగా ఎదుగుతాడు అని కూడా అనుకున్నారు. బట్ అతను ఆ విషయంలో రాంగ్ స్టెప్ వేశాడు. బాణం ఆకట్టుకున్నా ఐదేళ్ల గ్యాప్ తర్వాత బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా రూపొందించిన బసంతి డిజాస్టర్ అనిపించుకుంది. దీంతో ఇక చైతన్య పని ఐపోయింది అనుకున్నారు చాలామంది. బట్ మళ్లీ ఇన్నాళ్లకు భళా తందనాన అంటూ వస్తున్నాడు.
ఇక ఒక సినిమా హిట్ అయితే మూడు సినిమాలు ఫట్ అన్నట్టుగా సాగుతోంది శ్రీ విష్ణు కెరీర్. అయినా కాస్త కొత్త కథలు చెబుతాడు అని పేరు తెచ్చుకున్నాడు. ఆ మధ్య రాజరాజచోరతో ఆకట్టుకున్న శ్రీ విష్ణు రీసెంట్ గా అర్జున ఫల్గుణతో నిరాశపరిచాడు. అలాంటి తను ఏడేళ్లకు పైగా గ్యాప్ వచ్చిన చైత్యన్య దంతులూరితో భళా తందనాన సినిమా చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా కథలో మేటర్ ఉంటుందనుకోవచ్చు. పైగా ఈ చిత్రాన్ని వారాహి బ్యానర్ నిర్మిస్తోంది. రీసెంట్ గా ఈ చిత్రం నుంచి విడుదలైన మీనాచ్చి మీనాచ్చి అనే పాట వినసొంపుగా ఉంది. మణిశర్మ సంగీతం క్యాచీ ట్యూన్ తో ట్రెండీగా ఉంది. ఆ మధ్య విడుదలైన భళా తందనాన కాన్సెప్ట్ పోస్టర్ చూసినప్పుడే ఇదో కొత్త కథేమో అనిపించింది. అందుకు తగ్గట్టుగానే సాగిన ఈ పాట సైతం వినసొంపు గా ఉండి ఆకట్టుకుంటోంది. ఓ రకంగా వారాహి బ్యానర్ కు కూడా ఇప్పుడో పెద్ద విజయం కావాలి. అయినా చైతన్య దంతులూరిని నమ్మి ఆ విజయాన్ని కాంక్షిస్తోందంటే వారికి సైతం కథపై నమ్మకం ఉందనే అనుకోవచ్చు. ఏదేమైనా ఒక వైవిధ్యమైన కాంబినేషన్ గా వస్తోన్న భళా తందనాన ప్రేక్షకుల చేత కూడా భళా అనిపించుకుంటుందా లేదా అనేది చూడాలి.

Related Posts