ad

అది వయసు మళ్లిన హీరోలు కూడా ఇంకా ఒకటో నెంబర్ బస్సు, వందనం అభివందనం అంటూ ప్రేమకథా చిత్రాలు చేస్తూ.. నటిస్తోన్న కాలం. కొత్తతరం కూడా వచ్చింది. కానీ ఎవరూ అంతగా ఆకట్టుకోవడం లేదు.. ఆకట్టుకున్నా.. అది నిలకడగా మెయిన్టేన్ చేయడంలో తడబడుతున్నారు. అలాంటప్పుడు ఓ కుర్రాడు వచ్చాడు. తన సినీ జీవితానికి పునాదిరాళ్లు వేసుకుని.. సినిమాకు తన ప్రాణాన్నే ఖరీదుగా పెట్టి ‘కళ్ల’తోనే మాయ చేసి.. ప్రేక్షకుల దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. నలుగురిలో ఒకడుగా మొదలై.. ఒక్కో మెట్టూ ఎక్కుతూ.. ‘‘ఆ నలుగురు’’హీరోల్లోనే నెంబర్ వన్ అనిపించుకున్నాడు.

1983లో వచ్చిన ఖైదీతో ఇతనే తెలుగు సినిమా ఫ్యూచర్ స్టార్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత అతను లక్షలాది ప్రేక్షకుల హృదయాల్లో ఖైదీ అయ్యాడు. అభిమానులు పెరిగారు. ఆదరణ పెరిగింది. దీనికి తోడు హీరోకు సంబంధించి అతనో మెరుపు వేగం చూపించాడు. ఫైట్స్, డ్యాన్స్ ల్లో అప్పటి వరకూ చూడని ఓ గ్రేస్ ను యాడ్ చేశాడు. ఆ గ్రేస్ కు నాటి ఆంధ్రలోకం పడిపోయింది.. ఆ గ్రేస్ వల్లే ఆయన్ని బాస్ గా భావించింది. ఎదిగిన కొద్దీ ఒదుగుతూ.. తెలుగు సినిమా కమర్షియల్ స్టాండర్డ్స్ ను ఎల్లలు దాటించాడు. కమర్షియల్ సినిమాకు కరెక్ట్ పర్సన్ తనే అని అంతా అనుకునేలా చేశాడు. అతను కాలు కదిపితే కాసుల వర్షం. ఫ్లాప్ సినిమా సైతం నిర్మాతలకు నష్టాలు తేని వైనం. వెరసి తెలుగు సినిమాకు ఎన్టీఆర్, కృష్ణ తర్వాత మాస్ హీరోగా మారాడు. 80ల సగం నుంచి 95ల వరకూ బిగ్గెస్ట్ హిట్స్ తో బిగ్గర్ దన్ బిగ్ బి అని బాలీవుడ్ కూడా రాసుకునేలా చేసిన ఆ ఛరిష్మా పేరు చిరంజీవి.. మెగాస్టార్ చిరంజీవి.

బిగ్గర్ దన్ బిగ్ బి అన్న పేరు వచ్చిన తర్వాత కాస్త అహం కూడా యాడ్ అయిందో లేక.. మరేంటో కానీ కథలు గాడి తప్పాయి. వరుస ఫ్లాపులు. చిరంజీవి పనైపోయింది అన్నారు. ఆ మాట ఒక్కో సినిమాకూ పెరుగుతూ వెళ్లింది. దీంతో తనను తాను సరిదిద్దుకున్నాడు. గ్యాప్ తీసుకున్నాడు. ఇమేజ్ ను దాటి హిట్లర్ లా మారాడు. దాదాపు యేడాది గ్యాప్ తర్వాత చేసిన ఈ సినిమా సూపర్ హిట్. మళ్లీ కొత్త ఇన్నింగ్స్ మొదలు. మెగాస్టార్ అంటే మా మాస్టరే అని మళ్లీ ఫ్యాన్స్ కాలర్ ఎత్తారు. ఆ కాలర్ ను దించకుండానే వెళ్లాడు. మళ్లీ పొలిటికల్ గ్యాప్. ఎవరో చెప్పిన మాటలు విని నిజమే అనుకున్నాడు. వేటూరి చెప్పినట్టు… బృందావనంలో కృష్ణుడులా వెలిగిన వాడు.. రాజకీయ కారడివికి వెళ్లాడు. నమ్మిన వాళ్లు ముంచారు. లేదా తన అనుయాయుల వల్ల అభిమానులు హర్ట్ అయిన తర్వాత ముఖ్యమంత్రి పీఠం గ్యారెంటీ అని భావించినా అదంత సులువు కాదు అని తెలియడానికి యేళ్లు పట్టింది. ఈ లోగా తెలుగు సినిమా మారింది. కొత్త తరం వచ్చింది. కొత్త స్టార్స్ పుట్టుకొచ్చారు. అంతెందుకు ఆయన తర్వాత తమ్ముడే ఇక తనదే అగ్రపీఠం అన్నట్టుగా దూసుకుపోతున్నాడు. మరి మళ్లీ ఏమనుకున్నాడో. పాలిటిక్స్ కు తూఛ్ అన్నాడు. మరోసారి నమ్మినవాళ్లంతా హర్ట్ అయ్యారు. అయితేనేం అన్నయ్య మళ్లీ సినిమాల్లోకి వస్తున్నాడనే ఆనందం అందరిలో వచ్చింది. ఖైదీ నెంబర్ 150తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆయన్నుంచి అలాంటివి కోరుకుంటున్నారు అనే ‘‘భ్రమ’’వల్ల కాబోలు.. లేదూ నిజమే అయ్యుండొచ్చు కూడాను.. అమ్మడు కుమ్ముడు వంటి పాటకూ చిందులేశాడు. విజయం నమ్మకాన్నిచ్చింది. ఇక మూడో ఇన్నింగ్స్ మొదలు. తన వయసుకు మించినది అయినా.. డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా చేశాడు. చాలా కష్టపడ్డాడు. కానీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి.. అతిగా విమర్శలు రాలేదు. లేదంటే సైరా ఓ చవకబారు సినిమా అనేది అందరికీ.. ఆ మాటకొస్తే.. అన్ని సినిమాలు చేసిన ఆయనకూ తెలుసు. కానీ మనసు పడ్డ పాత్ర కదా.. ఆ సంతృప్తి మిగిలి ఉండొచ్చు.

ఒక వాస్తవం మాట్లాడితే దేశవ్యాప్తంగా చిరంజీవి తరం హీరోలకు ఆల్మోస్ట్ రిటైర్మెంట్ టైమ్ వచ్చింది. అలా రాలేదనుకునే ఇంకా పాతకాలంలా చొక్కాలు అటూ ఇటూ అంటూ.. స్టైలిష్ గా నడుస్తూ.. వరుస ఫ్లాపులతో తన ఫ్రెండ్ రజినీకాంత్ భంగపడుతూనే ఉన్నాడు కదా.. ?కానీ మెగాస్టార్ కు సూపర్ స్టార్ భంగపాటు కంటే తననుంచి ఇంకా ప్రేక్షకులు ఏదో ఆశిస్తున్నారు అనే భ్రమలే ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఆచార్య లాంటి ఉత్పాతం వచ్చింది. మెగాస్టార్ గా ఓ సామ్రాజ్యాన్ని నిర్మించిన ఆ నట చక్రవర్తికి ఈ సినిమా ఇచ్చిన పరాజయం.. పరాభవం అనే మాటకంటే ఎక్కువే బాధించే అంశం. ఎన్నో చూసిన ఆయనకు ఇది ఓ అనుభవం అయ్యి ఉండొచ్చు. కానీ అంత అనుభవం ఉన్న ఆయనకు ఇక తను మారాల్సిన టైమ్ వచ్చిందనేది అర్థం కాకపోవడమే కాస్త ఆశ్చర్యంగా ఉంది.

అవును చిరంజీవిగారి తీరు మారాలి. ఆయన మారాలి. వయసు పెరిగింది అని కాదు కానీ.. తన స్థాయికి తగ్గ పాత్రలు చేస్తే మంచిది. ఇప్పటికైనా కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం లేనిపోని డ్యాన్సులు కట్టి ఒళ్లు హూనం చేసుకునే కంటే ఓ గొప్ప కథను చెబితే చూస్తారు ప్రేక్షకులు. నాటి తన ఇమేజ్ కు భిన్నంగా కోసం చేసిన రుద్రవీణ, స్వయంకృషి, ఆపద్బాంధవుడు, చంటబ్బాయ్, ఆరాధన, విజేత, చక్రవర్తి వంటి సినిమాలు కథాబలం ఉన్నవే. వీటిలో చాలా వరకూ తన ఇమేజ్ తాలూకూ హడావిడీ కనిపించదు. కనిపించినా.. కథల బావున్నప్పుడు కాదు అనేశారు ఆడియన్స్. ఉదాహరణకు రుద్రవీణ చిత్రం తమిళ్ లో కమల్ హాసన్ చేశాడు. కానీ ఎంతటి మహానటుడైనా కమల్.. ఈ చిత్రంలో చిరంజీవితో పోలిస్తే తేలిపోతాడు. తను మనసు పెడితే ఇలాంటి కథలు ఇప్పుడు చెప్పొచ్చు. చిరంజీవి అంటే గౌరవం ఉంది. అభిమానం అలాగే ఉంది. కానీ ఫ్యాన్స్ కోసమే ఇదంతా అనే నిందను వారిపైకి నెట్టడం కాకుండా.. మారిన తరాలను గుర్తించాలి. ఆ తరాల అభిరుచులు వేరు అన్నది తెలుసుకోవాలి. ఖచ్చితంగా చెబితే.. ఇప్పుడు పాతతరం ప్రేక్షకులు పెద్దగా సినిమాలు చూడటం లేదు. 70శాతానికి పైగా ఫ్యామిలీ ఆడియన్స్ మొదటి వారం సినిమానే చూడటం లేదు. ఆ తర్వాతి వారానికి సినిమాలు ఉండటం లేదు. అందుకే ఇంకా గుప్పిగంతులు, పరిధికి మించిన ఫైట్లు కాకుండా.. కొత్త తరాన్ని ముందు పెట్టుకుని.. తను అద్భుతమైన కథలు చెప్పే అవకాశం ఉంది. అలాంటి కథల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నా నో ప్రాబ్లమ్. కానీ ఆ ఎలిమెంట్స్ కోసం ఇంకా తనే తాపత్రయపడటం మాత్రం అంత సబబుగా అనిపించడం లేదు.

వరుసగా సినిమాలు చేయడం వేరు.. కానీ ఒక్క గొప్ప సినిమాతో కొన్ని కాలాల పాటు నిలిచే సినిమాలు అందించొచ్చు. అందుకు తన ఇమేజ్ అనే అడ్డుతెరను మెగాస్టార్ వదిలించుకోవాలి. ఆయన ఇమేజ్ వజ్రం లాంటిది. అది మారదు. కానీ ఆ వజ్రం ఎప్పుడూ అలాగే ఉంటే ఏం బావుంటుంది. కాలాన్ని బట్టి రకరకాల డిజైన్స్ లోకి మారాలి. మారితేనే దాని విలువ, ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది. గత తరం డిజైన్స్ లోనే ఇప్పుడూ ఉంటా అంటే విలువ తగ్గదు.. కానీ ‘‘సేల్’’ అవడం కష్టం.

అందుకే మెగాస్టార్ గారూ.. మీరూ.. మీ కథల తీరూ మారాలి సర్. ఆ మార్పుతో మీరు ఎంతోమందిని మార్చే లేదా.. వారి హృదయాలకు హత్తుకునే అద్భుతమైన సినిమాలు చేయొచ్చు. బై ద వే.. మర్చిపోయారేమో.. మీలో ఓ మాగొప్ప నటుడు ఉన్నాడు. ఇన్నాళ్లూ ఇమేజ్ కోసం అతన్ని ‘‘అభిమానుల కోరిక అనే పంజరం’’ లో పెట్టారు. ఇక విడుదల చేయండి. మీలోని ఆ గొప్ప నటుడిని బయటకు తీయండి. ఆ నటన ఆ తరాన్ని, ఈ తరాన్ని కూడా మెప్పిస్తుంది. మీ తర్వాతి తరాలకు ఆదర్శంలానూ ఉంటుంది. అందుకే మెగాస్టార్ గారూ.. మీరూ.. మీ కథల తీరూ మారాలి సర్.

-యశ్వంత్ బాబు. కె

, , ,