మాస్ మహరాజ్ రవితేజ దూకుడుకు టాలీవుడ్ సైతం షేక్ అవుతోంది. ఒకటి తర్వాత ఒకటి అంటూ వరుసగా జెడ్ స్పీడ్ తో సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు. అవీ అంతే స్పీడ్ గా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. అయినా అతను ఆగడం లేదు. ఇప్పటికే మూడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ ఖిలాడీ స్టార్ లేటెస్ట్ గా మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. అన్ని చిత్రాల్లా ఇది కూడా అనౌన్స్ మెంట్ సౌండ్ లో సాలిడ్ అనిపించుకుంటోంది.

క్రాక్ హిట్ తర్వాత వరుసగా ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ అంటూ రెండు డిజాస్టర్స్ చూశాడు రవితేజ. ఇవి ప్రొడక్షన్ లో ఉన్న టైమ్ లోనే మరో మూడు సినిమాలకు సైన్ చేశాడు. అందులో మొదటిది ధమాకా. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ఇది. అటుపై టైగర్ నాగేశ్వరరావు అంటూ స్టూవర్ట్ పురంకు చెందిన వ్యక్తి బయోపిక్ లాంటి సినిమాకు ఓకే చెప్పాడు. మరోవైపు రావణాసుర అనే సినిమా కూడా ప్రస్తుతం షూటింగ్ లో ఉంది. విశేషం ఏంటంటే.. ఈ మూడు సినిమాలూ ఒకేసారి చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. అన్నీ కుదిరితే ఈ యేడాదే రెండు సినిమాలు విడుదలవుతాయి. దీంతో ఆల్రెడీ మరో ప్రాజెక్ట్ కు ఓకే చెప్పాడు మాస్ రాజా..

సినిమాటోగ్రాఫర్ గా మంచి పేరు తెచ్చుకున్న యంగ్ స్టర్ కార్తీక్ ఘట్టమనేని. రీసెంట్ బ్లాక్ బస్టర్ కార్తికేయ2కు కూడా అతనే కెమెరామేన్. 2015లో కార్తికేయ సూర్య వర్సెస్ సూర్య అనే సినిమాను డైరెక్ట్ చేశాడు. నిఖిల్ హీరోగా నటించిన ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేదు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత కెప్టెన్ చైర్ లో కూర్చోబోతున్నాడు కార్తీక్. రవితేజకు కథ చెప్పి ఒప్పించాడట. ఈగిల్ అనే టైటిల్ తో రాబోతోన్న ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించబోతోంది. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ చిత్రం ఎక్కువ భాగం విదేశాల్లోనే చిత్రీకరణ జరుపుకుంటుందట. రావణాసుర సినిమా పూర్తయిన తర్వాత ఈ ఈగిల్ మూవీ పట్టాలెక్కుతుందని టాక్. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందంటున్నారు. ఏదేమైనా మాస్ రాజా దూకుడు మామూలుగా లేదు.

, , , , , , , , , , , ,