Advertisement
మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘అఖండ’ – రివ్యూ
Latest Movies Reviews Tollywood

మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘అఖండ’ – రివ్యూ

Advertisement

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ‌, ఊర మాస్ డైరెక్ట‌ర్ శ్రీను.. వీరిద్ద‌రిది హిట్ కాంబినేష‌న్. సింహా, లెజెండ్ చిత్రాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎలాంటి రికార్డులు సెట్ చేశాయో తెలిసిందే. దీంతో మ‌ళ్లీ వీరిద్ద‌రూ క‌లిసి అఖండ సినిమా చేస్తున్నారు అన‌గానే.. అంచ‌నాలు ఆకాశాన్ని తాకాయి. దీనికి తోడు టీజ‌ర్ అండ్ ట్రైల‌ర్ ను ట్రెమండ‌స్ రెస్పాన్స్ రావ‌డంతో అఖండ సినిమాతో బాల‌య్య‌, బోయ‌పాటి హ్యాట్రిక్ సాధించ‌డం ఖాయ‌మ‌నే టాక్ వ‌చ్చింది. ఇన్ని అంచ‌నాల‌తో అఖండ ఈరోజు (డిసెంబ‌ర్ 2న‌) ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి.. బాల‌య్య‌, బోయ‌పాటి హ్యాట్రిక్ సాధించారా.? లేదా..? అనేది తెలుసుకుందాం..

క‌థ

ముర‌ళీకృష్ణ అనంత‌పురంలో ఉండే ఓ రైతు (బాల‌కృష్ణ‌). పేరుకు రైతే కానీ.. చుట్టుప‌క్క‌ల గ్రామాల్లో ఏ క‌ష్టం వ‌చ్చినా నేనున్నాను అంటూ ముందుంటాడు. అలాగే హింస మంచికాదు అని చెబుతూ.. ఫ్యాక్ష‌నిజం బాట‌ప‌ట్టిన ఎంతో మందిని మారుస్తాడు. మంచి మార్గంలో న‌డిచేలా చేస్తాడు. ఇదే జిల్లాకు క‌లెక్ట‌ర్ గా వ‌స్తుంది శ‌ర‌ణ్య (ప్ర‌గ్యాజైస్వాల్). ఆమె ముర‌ళీకృష్ణను చెడ్డ‌వాడు అనుకుంటుంది. ఆత‌ర్వాత అత‌ని మంచిత‌నం గురించి తెలుసుకుని మ‌న‌సుపారేసుకుంటుంది. ఆత‌ర్వాత పెద్ద‌ల అంగీకారంతో ఇద్ద‌రూ పెళ్లి చేసుకుంటారు.

అయితే.. ఆ ప్రాంతంలో వ‌ర‌ద రాజులు (శ్రీకాంత్) మైనింగ్ మాఫియాని న‌డుపుతుంటాడు. యురేనియం త‌వ్వకాలతో చిన్నారుల ప్రాణాల‌కి ముప్పు ఏర్పడుతుంది. ఈ విష‌యం తెల‌సుకుని మైనింగ్ మాఫియా భ‌ర‌తం ప‌ట్టేందుకు రంగంలోకి దిగిన ముర‌ళీకృష్ణ ఊహించ‌ని ప‌రిణామాల‌తో విచార‌ణ ఎదుర్కొవాల్సి వ‌స్తుంది. ఇలా ముర‌ళీకృష్ణ క‌ష్టాల్లో ఉంటే.. అత‌ని కూతురు చావుబ‌తుకుల్లో ఉంటుంది. ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా వ‌ర‌ద రాజులు మ‌నుషులు చుట్టూ ఉంటారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ముర‌ళీకృష్ణ తోడ‌బుట్టిన శివుడు (బాల‌కృష్ణ‌) ఆదుకుంటాడు. ఇన్నాళ్లు శివుడు ఎందుకు దూరంగా ఉన్నాడు..? అస‌లు శివుడు ఎందుకు ఇంటికి దూరంగా పెరిగాడు.? ముర‌ళీకృష్ణ ఎలా బ‌య‌ట‌కు వ‌చ్చాడు..? వ‌ర‌ద రాజుల మైనింగ్ ఆగ‌డాల‌ను ఎలా అంతం చేశారు..? అనేదే మిగిలిన క‌థ‌.

ప్లస్ పాయింట్స్

బాల‌కృష్ణ న‌ట‌న‌
యాక్ష‌న్ ఎపిసోడ్స్
మ్యూజిక్
సెకండాఫ్

మైన‌స్ పాయింట్స్

యాక్ష‌న్ పార్ట్ ఎక్కువు కావ‌డం..

ఎలా ఉందంటే

ముర‌ళీకృష్ణ‌, శివుడు.. ఈ రెండు పాత్ర‌ల్లో బాల‌కృష్ణ న‌ట విశ్వ‌రూపం చూపించారు. ఆయ‌న‌ని త‌ప్పా.. ఇంకెవ‌ర్నీ ఆ పాత్ర‌లో ఊహించుకోలేం. జై బాల‌య్య పాట‌లో స్టెప్పులు అద‌ర‌గొట్టి ఫ్యాన్స్ లో జోష్ నింపారు. ఇక యాక్ష‌న్ సీన్స్ లో అయితే.. నెక్ట్స్ లెవ‌ల్ అన్న‌ట్టుగా ఉంది. ముఖ్యంగా శివుడు పాత్ర‌లో అయితే.. బాల‌య్యలో ఆ ప‌ర‌మ‌శివుడే ఆవ‌హించాడా..? అన్న‌ట్టుగా న‌టించారు. బాల‌య్య న‌టించారు అన‌డం కంటే.. జీవించారు అని చెప్ప‌చ్చు.

క‌థానాయిక ప్రగ్యా జైస్వాల్ అందం, అభిన‌యంతో ఆక‌ట్టుకుంది. అలాగే క‌థానాయిక‌ పూర్ణ కూడా పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా న‌టించింది. ఇక లెజెండ్ సినిమాతో జ‌గ‌ప‌తిబాబును విల‌న్ గా చూపించిన బోయ‌పాటి ఈ సినిమాతో శ్రీకాంత్ ను విల‌న్ గా మార్చారు.
వ‌ర‌ద రాజులుగా క్రూర‌మైన పాత్రలో ఆయ‌న క‌నిపిస్తారు. శ్రీకాంత్ విల‌న్ పాత్ర‌ను అది కూడా బాల‌య్య సినిమాలో విల‌న్ గా ఎలా ఉంటారో అనుకుంటే.. బాల‌య్య‌తో ఢీ అంటే ఢీ అన్న‌ట్టుగా న‌టించారు. జ‌గ‌ప‌తిబాబు, కాల‌కేయ ప్రభాక‌ర్ త‌దిత‌రులు పాత్రల ప‌రిధి మేర‌కు న‌టించారు.

త‌మ‌న్ సంగీతం సినిమాని మ‌రో లెవ‌ల్ కి తీసుకెళ్లింది. జై బాల‌య్య‌, అఖండ, అడిగా అడిగా.. పాట‌లు బాగున్నాయి. రామ్‌ప్రసాద్ కెమెరా ప‌నిత‌నం, ఎం.ర‌త్నం మాట‌లు చిత్రానికి ప్రధాన బ‌లాలుగా నిలిచాయి. రామ్‌ల‌క్ష్మణ్‌, స్టంట్‌ శివ పోరాట ఘ‌ట్టాలు మెప్పిస్తాయి. ఇంట‌ర్వెల్ ముందు వ‌చ్చే యాక్ష‌న్ సీన్ అయితే అదిరింది. సినిమా స్టార్ట్ అయిన‌ప్ప‌టి నుంచి ఎండ్ వ‌ర‌కు నెక్ట్స్ ఏంటి..? అని ఉత్కంఠ‌తో ఆడియ‌న్స్ చూసేలా తీయ‌డంలో బోయ‌పాటి స‌క్స‌స్ అయ్యారు. ఆయ‌న టేకింగ్ ఎలా ఉంటుందో తెలిసిందే. ఇందులో అయితే.. వేరే లెవ‌ల్ అన్న‌ట్టుగా ఉంది. ఇంకా చెప్పాలంటే.. ఈ జ‌న‌రేష‌న్ లో బాల‌య్య‌ను ప‌వ‌ర్ ఫుల్ గా చూపించే ద‌ర్శ‌కుడు అంటే బోయ‌పాటే.

అభిమానులు ఎన్ని అంచ‌నాల‌తో వ‌చ్చినా.. అంత‌కు మించి ఉంటుంది. థియేట‌ర్లో పూన‌కాలే.. అన్న‌ట్టుగా ఉంది. ఏ సినిమాకైనా క‌థ‌లో అక్క‌డ‌క్క‌డా స్లోగా ఉండ‌డం చూస్తుంటాం కానీ.. అఖండ‌లో బిగినింగ్ నుంచి ఎండ్ వ‌ర‌కు ఆ టెంపో ఎక్క‌డా త‌గ్గ‌లేదు. అఖండ గురించి ఒక్క మాట‌లో చెప్పాలంటే.. బాల‌య్య న‌ట విశ్వ‌రూపం అఖండ‌.

రేటింగ్ 3.5/5

Advertisement